Job Calendar | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌తో కూడిన జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కానీ, ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరం వచ్చింది. కానీ, కొత్తగా ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. ఇస్తే సంవత్సరం మొదట్లో జనవరిలో ఇవ్వాలి. లేదా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1న ఇవ్వాలి. జనవరి ఒకటి పోయింది. ఏప్రిల్ ఒకటి కూడా గడిచిపోయింది. కానీ, కొత్త జాబ్ క్యాలెండర్ పత్తాలేకుండా పోయింది. ఉద్యోగాలు భర్తీచేసే టీజీపీఎస్సీ కూడా ‘ఇండెంట్లు ఇవ్వండి మహాప్రభో..’ అని అడిగినా ప్రభు త్వం నుంచి స్పందన లేదు. దీంతో ప్రస్తుతం భర్తీ చేయాల్సిన పోస్టులేవీ టీజీపీఎస్సీ చేతిలో లేవు. అసెంబ్లీలో ప్రకటించిన 2024-25 జాబ్ క్యాలెండర్ ఇండెంట్లు టీజీపీఎస్సీకి అందలేదు.
ఈ నేపథ్యంలో కొత్తగా 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను రూపొందించాలని కమిషన్ నిర్ణయించింది. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలను 2025 మార్చి 31లోగా సమర్పించాలని ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వానికి టీజీపీఎస్సీ లేఖ రాసింది. ‘ఏడాది కాలంలో భర్తీ చేసే మొత్తం పోస్టుల వివరాలను అందజేయండి. ఏప్రిల్‌లో కసరత్తు పూర్తిచేస్తాం. మే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం. మళ్లీ మార్చి నాటికి ఆయా ఉద్యోగాలన్నింటినీ భర్తీచేస్తాం. మళ్లీ ఏప్రిల్‌లో మరికొన్ని ఖాళీల వివరాలివ్వండి. మళ్లీ మార్చి వచ్చే వరకు ఆయా ఉద్యోగాలను భర్తీచేస్తాం. ఇలాగే క్యా లెండర్‌ను కొనసాగిస్తాం’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నది. కానీ, సర్కారు నుంచి కనీస స్పందనలేదు.
ఒక్క ఇండెంట్ ఇస్తే ఒట్టు
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలా పెద్ద కసరత్తు. తొలుత ఉద్యోగ ఖాళీల వివరాలను శాఖల వారీగా తేల్చాలి. అవసరమైన మేరకు కొత్త పోస్టులను మంజూరుచేయాలి. వాటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. ఆయా ఇండెంట్లు టీజీపీఎస్సీకి, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు చేరాలి. ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియను ప్రా రంభిస్తాయి. ఇందులో ఎక్కడ ఆలస్యం జరిగినా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అయితే, ఇటీవలి కాలంలో ఏ ఒక్క ప్రభుత్వ శాఖలోనూ పో స్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన దాఖలాలే లేవు.
ఉద్యోగాలు కేసీఆర్‌వి.. క్రెడిట్ కాంగ్రెస్‌ది
16 నెలల్లో 57 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేసినట్టు ప్రభుత్వం చెప్తున్నది. వీటిలో కాంగ్రెస్ సర్కారు కొత్తగా భర్తీచేసింది ఆరువేల ఉద్యోగాలే! గ్రూప్-1, డీఎస్సీలు కూడా కేసీఆర్ హయాంలో విడుదలైనవే. పాత వాటిని రద్దుచేసి, కొన్ని పోస్టులను కలిపి విడుదల చేసినవే. కాంగ్రెస్ భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్న ఉద్యోగాలన్నీ గతంలో కేసీఆర్ హయాంలో 2022, 2023లో నోటిఫికేషన్లు ఇచ్చినవే. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఉద్యోగాలిచ్చినట్టు ప్రభుత్వం బిల్డప్ ఇస్తున్నది. జేఎల్ నోటిఫికేషన్ దాదాపు 13 ఏండ్ల తర్వాత కేసీఆర్ సర్కారే విడుదల చేసింది. ఇటీవల ఫలితాలు ప్రకటించిన గ్రూప్-4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే నిర్వహించారు. గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లను కూడా బీఆర్ఎస్ సర్కారే విడుదల చేసింది. వాటిలో కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా, ఇటీవల న్యాయస్థానాల్లో చిక్కుముడులు వీడటంతో ఇప్పుడు నియామకపత్రాలిచ్చి తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నది.
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని క్యాలెండర్ ఇదే
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎంతో అట్టహాసంగా ప్రకటించిన 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదలకాలేదు. ఈ విధంగా ఒక్క నోటికేషన్ కూడా ఇవ్వని జాబ్ క్యాలెండర్‌గా రికార్డులకెక్కింది. అక్టోబర్‌లో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ, ఇవ్వలేదు. విద్యుత్తు సంస్థల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీచేయాల్సి ఉండగా, అదీ జాడలేదు. జాబ్ క్యాలెండర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో కేవలం ప్రకటన మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు.
యూత్‌కు ధోకా
అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. దీనిని మ్యానిఫెస్టోలో సైతం పొందుపరిచింది. అయితే, ఒక్క హామీని కూడా ఈ 16 నెలల్లో నెరవేర్చేలేదు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తదితర హామీలేవీ అమలు కాలేదు. తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ అటకెక్కింది. ఆఖరుకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు రూ.వెయ్యి, రూ.రెండువేల ఫీజులు వసూలు చేసింది.
ఉద్యోగాలు ‘కల్పనే’నా?
రాష్ట్రంలో అమలవుతున్న పరిపాలనా సంస్కరణలకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేయడంలేదు. దీంతో కొత్త ఉద్యోగాల కల్పన అనేది ‘కల్పన’గానే మిగిలిపోతున్నది. పలు కీలక శాఖలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో హెచ్‌వోడీ పోస్టులు, క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరుచేయలేదు. అర్ధగణాంక శాఖ డైరెక్టరేట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖల పునర్వ్యవస్థీకరణ ఇప్పటికీ జరగలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖదీ ఇదే పరిస్థితి. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు మున్సిపల్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేయలేదు. నీటి పారుదల శా ఖలో కొత్త డివిజన్లలో 36 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరుచేయాల్సి ఉన్నది. కొన్ని శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్‌ను విభజించలేదు. విద్యాశాఖలో అన్నీ జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయలేదు. ఇంటర్ విద్యాధికారుల పోస్టుల్లేవు. నోడల్ అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన కొన్ని కాలేజీలకు పోస్టులను మంజూరుచేయలేదు.
ఖాళీలున్నా నియామకాలు గుండుసున్నా
సంవత్సర కాలంలో తొమ్మిది వేల మంది ఉద్యోగ విరమణ పొందారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది వేల మంది రిటైర్‌కానున్నారు. ఇవన్నీ ఖాళీలే. పైస్థాయి పోస్టులు ఖాళీ అయితే, కింది వారికి ప్రమోషన్లు ఇ వ్వాలి. దీంతో కిందిస్థాయి పోస్టులు ఖాళీ అవుతాయి. వాటిని భర్తీ చేసుకోవచ్చు. ఒకవైపు, పోస్టులు ఖాళీ అవుతున్నా రిక్రూట్మెంట్లు లే వు. రిటైరైన వారినే మళ్లీ కన్సల్టెంట్, కాంట్రాక్ట్ పేరిట కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
‘పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి.. నోటిఫికేషన్లు చాలిక ఆపండంటూ నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనలు చేసే పరిస్థితికి వచ్చింది. నోటిఫికేషన్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఒకదానికి, మరోదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నది.
మార్చి 31లోగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలివ్వండి. రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయవచ్చో ఆ వివరాలు సమర్పించండి. నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేం ఏర్పాట్లు చేసుకుంటాం. మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం. ఇది ప్రభుత్వానికి టీజీపీఎస్సీ రాసిన లేఖ రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన మాట ఇది.
ఒకవైపు.. నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలుమరోవైపు.. ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లకు పరోక్షంగా మోకాలడ్డుఇదీ కాంగ్రెస్ సర్కారు రీతి! ద్వంద్వనీతి!
యూత్ డిక్లరేషన్, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు..