హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనిదే పౌరసరఫరాల సంస్థ నడవలేని స్థితిలో ఉన్నదని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సమీక్ష జరిపిన అనంతరం ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
2016-17 నుంచి ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ.58,860 కోట్లకు పెరిగినట్టు చెప్పారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరాకు కూడా నిధులు ఇవ్వలేదని, ఇందుకు సంబంధించిన బకాయిలే రూ.14,354 కోట్లు ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు, బియ్యం సరఫరాకు గత ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించలేదని, దీంతో ప్రతినెల రూ.3 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
ఎన్ని అప్పులున్నా రేషన్ బియ్యం పంపిణీ, విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందించడం, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసిందని, ఇప్పటికే రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి: టీఎన్జీవో
నూతన పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సం ఘం ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానం రద్దు చేయాలని, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. శనివారం హైదరాబాద్‌లోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. తెలంగాణ అర్ధగణాంక శాఖ ఫోరం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో ప్రతినిధి బృందం నేతలు పలు అంశాలపై డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు.
జీవో -317తో జరిగిన అన్యాయాలను సరిచేయాలని కోరారు. అర్ధగణాంకశాఖ స్టాఫ్ ప్యా ట్రన్, ఉప గణాంకశాఖ అధికారి పోస్టును మల్టీజోన్ పోస్టుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీఎన్జీవో సహ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, హరికృష్ణ, మంత్రిప్రగడ శ్రీనివాస్, వేణుమాధవ్, శివకుమార్, నర్సింహాచారి, వెంకటరమణ, కట్ట వెంకట్, నగేష్, దుర్గేశ్, రవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు ఇంజినీర్ల సమస్యను పరిష్కరించాలి
విద్యుత్ సంస్థల్లో రివర్షన్‌కు గురైన విద్యుత్తు ఇంజినీర్లకు న్యాయం చేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రివర్షన్ చేసిన ఇంజినీర్లను వారి వాస్తవ పోస్టులోకి తీసుకొని, పదోన్నతులు కల్పించాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారికి న్యాయం చేద్దామని ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.