Crop Loan | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల్లో భారీ కోత పడింది. నిరుటితో పోలిస్తే రూ.3,646 కోట్లు తగ్గింది. నిరుడు పంట రుణాల లక్ష్యం రూ.90,794 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్(నాబార్డు) రూ.87,148 కోట్లకు తగ్గించింది. 2025-26 సంవత్సరానికిగాను పంట ఉత్పత్తి, మార్కెటింగ్, టర్మ్ లోన్లకు రూ.1.39లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు నాబార్డు ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సంబంధించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని మ్యారిగోల్డ్ హోటల్లో నిర్వహించిన ‘నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్’లో విడుదల చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.62 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని నాబార్డు లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రానికి అంచనా వేసిన రుణ సామర్థ్యం మొత్తం రూ.3.86 లక్షల కోట్లు అని వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 37.80 శాతం వృద్ధిని సూచిస్తున్నదని పేర్కొం ది. ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు అద్భుతమైన పురోగతి సా ధించిందని నాబార్డు తెలిపింది. దేశ మొత్తం బియ్యం ఉత్పత్తికి ఇది 12 శాతం తోడ్పతుందని స్పష్టం చేసింది. పౌల్ట్రీ ఉత్పత్తిలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొంది.
ధరలు వచ్చే పంటలకు మద్దతు: భట్టి
అత్యధిక ధరలు వచ్చే పంటలు పసుపు, మామిడికి నాబార్డు మద్దతుగా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. సేంద్రీయ వ్యవసాయదారులు, స్వయం సహాయక సంఘాలను నాబార్డు ప్రోత్సహించాలని సూచించారు.
నెరవేరని రుణాల లక్ష్యం
పంట రుణాల విషయంలో బ్యాంకులు ఎంచుకున్న లక్ష్యాలు క్షేత్రస్థాయిలో అందుకోవడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.73,437 కోట్ల రుణ లక్ష్యం విధించుకోగా రూ.64,939 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. 2024-25లో రూ.90,794కోట్లు లక్ష్యంగా విధించుకోగా ఇందులో 70 శాతం మాత్రమే రుణాలు మంజూరైనట్టు తెలిసింది.
వ్యవసాయశాఖ బడ్జెట్ 42వేల కోట్లు!
2025-26 సంవత్సరానికి గాను ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ. 42వేల కోట్ల బడ్జెట్ కేటాయించే అవకాశముందని తెలుస్తున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించినట్టుగా తెలిసింది. సుమారు రూ.18వేల కోట్లు రైతుభరోసాకు, రూ.1500 కోట్లు రైతుబీమాకు పోగా మిగిలిన రూ.20వేల కోట్లలో ఎక్కువ భాగం వేతనాలకే వెచ్చించినట్టు సమాచారం.
వివిధ రంగాలకు వ్యవసాయ రుణ ప్రణాళిక