KP Vivekananda | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల గణనపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. రూ.200కోట్లతో చేపట్టిన సర్వేతో రెండుకోట్ల మంది బడుగు, బలహీనవర్గాలను అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం భట్టి మాటలతో తేట తెల్లమైందని.. నిపుణుల మాటలను ప్రభుత్వం పెడచెవిన బెట్టిందని ఆరోపించారు. సర్వే చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుంది? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు ఏది చేసినా తిరోగమనమేనని.. అన్నింటా ప్రభుత్వం అభాసు పాలవుతోందన్నారు. బీఆర్ఎస్ సహా బీసీ సంఘాలన్నీ రీ సర్వేకు డిమాండ్ చేశాయన్నారు. కులాల జనాభాను కుట్ర పూరితంగా తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. కూడికలు తీసివేతలతో సర్వేను కుట్ర పూరితంగా మార్చారని మండిపడ్డారు.
ప్రజల నుంచి వస్తున్న రీ సర్వే డిమాండ్ వేరు.. ప్రభుత్వం చేస్తున్నది వేరన్నారు. సర్వేలు దేశవ్యాప్తంగా ఎన్నో జరిగాయని.. విఫలమైందని మాత్రం రేవంత్ ప్రభుత్వ సర్వే మాత్రమేనన్నారు. ఎదో మళ్లీ నాలుగు పేజీలు జోడించి.. మమ అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేసినా.. ప్రభుత్వం సరిచేసుకోలేదని విమర్శించారు. డేడికేటెడ్ కమిషన్‌ను నిపుణులతో ఏర్పాటు చేసి రీ సర్వే చేయాలని.. అప్పుడే చట్టబద్ధత వస్తుందన్నారు. డేడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి రీ సర్వే చేస్తేనే న్యాయ స్థానాల్లో నిలబడుతుందని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీ ఒక్క రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారని.. ఆ రోజు బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తారనుకుంటే చేయలేదన్నారు. ఇప్పుడు చట్టబద్ధతపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల గురించి నిన్న సీఎం నేతృత్వంలోని మీటింగ్ పెట్టారని, అందులో కాంగ్రెస్ విజయావకాశాలను సర్వే రిపోర్టుల ఆధారంగా చర్చించారన్నారు.
సర్వేల్లో కాంగ్రెస్‌కు చావు దెబ్బ తప్పదని వచ్చిందని.. అందుకే స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని విమర్శించారు. సర్వేలో 70 రకాల ప్రశ్నలు చేశారని.. అందుకే ప్రజల్లో ఉత్సాహంగా పాల్గొనలేదన్నారు. సరళమైన ప్రశ్నావళిని రూపొందించి రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని.. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని.. అందులో ఏ హామీపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అఖిల పక్ష సమావేశం ఎప్పుడో నిర్వహించాల్సిందని.. రేవంత్ ప్రభుత్వం లీకులు, సాకులు, ఫేక్‌ల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం కులగణన సరిగా చేయలేదని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే రాహుల్ తెలంగాణకు మొహం చాటేశారన్నారు. ప్రజల్లో ఆగ్రహాన్ని చూసే రాహుల్ వరంగల్ టూర్‌ను రద్దు చేసుకున్నారని, కేసీఆర్, కేటీఆర్‌ల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయని.. కేవలం సర్వే ద్వారా వివరాలు తెలుస్తాయనడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వమన్నారు.