Bhatti Vikramarka | హైదరాబాద్ : ప్రకటించిన షెడ్యూల్ మేరకు జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమయం వృథా చేయకుండా డీఎస్సీకి ప్రిపేర్ కావాలని ఆయన సూచించారు. గాంధీ భవన్లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నాం. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశాం. గత ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ మాసంలో 5 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 5 వేల పోస్టులకు, మరో 6000 కలిపి 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తంగా 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2 లక్షల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,000 ఉద్యోగాలు పోగా, మరో ఐదు వేల ఖాళీలు ఉన్నాయి. ఈ ఐదువేల ఖాళీలతో పాటు మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్లు వేస్తూనే ఉంటుంది. ఇటీవల రాష్ట్రంలో 19 వేల మంది పైచిలుకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 34,000 మంది ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించామని భట్టి విక్రమార్క తెలిపారు.