హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభను, ప్రజలను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ స్పీకర్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సోమవారం సభా హక్కుల నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో రూ. 6.7 లక్షల కోట్ల అప్పులున్నాయని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సభను తప్పుదారి పట్టించారని స్పష్టంచేసింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో అప్పు రూ.3.89 లక్షల కోట్లేనని తేల్చిన విషయాన్ని ఉదహరించింది. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాబీ లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం లో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘనపై నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతి ఇచ్చారనే విషయాన్ని గుర్తుచేశారు.
డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ విషయం తెలుసని చెప్పారు. ఈ క్రమంలో తమ నోటీసులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం నుంచి మొదలుకుంటే మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై బయట కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పులు, వాటికి సంబంధించిన వడ్డీల లెక్కలన్నీ తప్పు ల తడకలేనని, ఆర్బీఐ నివేదికే ఇందుకు నిదర్శమని చెప్పారు. మాజీ సర్పంచ్‌లకు రూ. 600 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. బడా కాంట్రాక్టర్లకు ఇచ్చిన రూ.1200 కోట్ల బిల్లుల్లో సగం చెల్లించినా మాజీ సర్పంచ్ల సమస్యలు పరిషారమవుతాయని చెప్పారు. రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన సభా సంప్రదాయాలకు విరుద్ధమని కేటీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలనే విషయాన్ని భట్టి మరచిపోయారని ఎద్దేవాచేశారు. ఈ విషయాన్ని తాము స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
సభా ప్రాంగణంలో ఆంక్షలా?
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మా జీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్సీలను శా సనసభ వైపు రావద్దని ఆదేశాలు జారీ చే యటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి మంత్రుల ను, ముఖ్యమంత్రిని కూడా కలిసేవారని పేర్కొన్నారు. అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకూడదని ఆంక్షలు జారీ చేయటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గారని, ఇదే విషయాన్ని చెప్పేందుకు వెళ్లిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్నారని విమర్శించారు.