Banda Prakash | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏ కులానికి నిర్దిష్టమైన పథకాన్ని తీసుకురాలేదని డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. రాజీవ్ యువ వికాసంలో బీసీ వర్గాలకు న్యాయం చేయలేదని విమర్శించారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనాల్లో మూడు కులాల భవనాలకు టెండర్లు అయ్యాయని తెలిపారు. రెండు భవనాలకు పాక్షికంగా పనులు జరిగాయని పేర్కొన్నారు. ముదిరాజ్ భవనం ఇంకా పునాదుల దగ్గరే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యెగ్గె మల్లేషం కురుమ సంఘం భవనాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆత్మగౌరవ భవనాలపై సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఏమైనా ఖర్చు చేశారో చెప్పాలన్నారు.వచ్చే బడ్జెట్లో భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
బీసీలను ఆదుకుంటామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అనేక హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్నారు. బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని అన్నారని తెలిపారు. కానీ గతంలో ఉన్న 8 కార్పొరేషన్ల నుంచే మరో 8 ఏర్పాటు చేశారని విమర్శించారు. కార్పొరేషన్లకు నిధులు లేవని.. యంత్రాంగం లేదని అన్నారు. కుల భవనాలకు కేటాయించిన స్థలాలను యథావిధిగా కొనసాగిస్తారా? లేదా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కుల సంఘాల భవనాల కోసం దశాబ్దాలుగా పోరాటం చేశామని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కులసంఘాల భవనాల కోసం స్థలాలు కేటాయించారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.