Thermal Power | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ విద్యుత్తు డిమాండ్ పెరిగిపోతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టీపట్టునట్టుగా వ్యవహరిస్తున్నది. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో బొగ్గు సరఫరాను పెంచకుండా థర్మల్ విద్యుత్తు కేంద్రాలను మూసివేయించి తద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నది.
ప్రస్తుత నిల్వలు వారానికే సరి!
దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన 181 థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దేశీయ బొగ్గు, దిగుమతి చేసుకున్న బొగ్గు, పిట్‌హెడ్, వాషరీ రిజెక్ట్స్ లాంటివాటితో నడిచేవి ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,06,746 మెగావాట్లు. వీటిని సగటున 85% పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే రోజుకు 28 లక్షల టన్నులకుపైగా బొగ్గు అవసరం. నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌లో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ఈ లెక్కన 181 థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కలిపి 5.43 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం 2.14 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నాయి. ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో ఇది 39 శాతమే. ఈ నెల 9 నాటికి కేవలం 7.6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదికల్లో వెల్లడించింది.
84 థర్మల్ ప్లాంట్లలో ప్రమాద ఘంటికలు
దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వల పరిస్థితి మరింత విషమంగా ఉన్నది. ఇక్కడ బొగ్గు నిల్వలు అడుగంటే దశలో ఉండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పిట్‌హెడ్ (బొగ్గు గనులకు పక్కనే) థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత అంతగా లేదు. కానీ రోడ్డు, రైలు మార్గాల్లో బొగ్గును రవాణా చేసుకోవాల్సిన థర్మల్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా కనబడుతున్నది.
రాజస్థాన్‌లోని మొత్తం 7 ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నది. ఈ ప్లాంట్ల సామర్థ్యం 7,580 మెగావాట్లు. ఇక్కడ నిల్వ ఉండాల్సిన బొగ్గులో 12 శాతమే నిల్వ ఉన్నది. 20.84 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సిన ఈ ప్లాంట్లలో 2.90 లక్షల టన్నులు మాత్రమే ఉండటం ప్రమాద ఘంటికలకు సంకేతం.
ఉత్తరప్రదేశ్‌లో 3 ప్లాంట్లు, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3, తమిళనాడులో 3, ఎన్టీపీసీకి చెందిన 12 ప్లాంట్లు, ఎన్టీపీసీ జాయింట్ వెంచర్లలో 4 ప్లాంట్లు.. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి.
దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు కలవరపెడుతుండగా తెలంగాణలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో మాత్రం సగటున 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండటం విశేషం. బొగ్గు నిల్వల విషయంలో ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నది.
రైల్వే రేక్స్ కొరత.. వర్షాల ప్రభావం
ఇటీవల భారీ, అకాల వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతున్నది. దీనికితోడు రైల్వే ద్వారా బొగ్గు రవాణాకు కావాల్సిన రేక్స్ కూడా అందుబాటులో ఉండటం లేదు. దేశవ్యాప్తంగా రైల్వేల ద్వారా రవాణా అయ్యే బొగ్గులో 24.26% బొగ్గు అన్ లోడింగ్ తగ్గింది. ఇందులో వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సుమారు 30%, ఉత్తర రైల్వే పరిధిలో 33%, నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో 29% బొగ్గు రేక్స్ అన్లోడింగ్ తగ్గినట్టు రైల్వేశాఖ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. రైల్వే అధికారులు మాత్రం ఈ పరిస్థితికి రేక్స్ కొరత కారణం కాదని, భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గడమే కారణమని చెప్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే సగటున 190 నుంచి 220 గిగావాట్ల డిమాండ్ ఉంటోంది. సెప్టెంబర్‌లో రికార్డుస్థాయిలో 240 గిగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చింది. వచ్చేది పండుగల సీజన్. విద్యుత్తు వినియోగంతోపాటు గరిష్ఠ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగినంతగా బొగ్గును సరఫరా చేయలేకపోతే.. పండుగల సమయంలో చీకట్లు ముసిరే ప్రమాదం ఉన్నదని, చాలాచోట్ల విద్యుత్తు కోతలకు దారితీయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.