హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్ష కేంద్రాలను అస్తవ్యస్తంగా కేటాయించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒకేరోజు పరీక్ష ఉన్న అభ్యర్థులకు దూరాన ఉన్న వేర్వేరు జిల్లాల్లో కేంద్రాలను కేటాయించింది. తాజాగా ఒకేరోజు పరీక్ష ఉన్నవారికి ఒకే సెంటర్లో పరీక్ష కేందాలను కేటాయించింది.
ఇలా 14 మంది అభ్యర్థులకు ఒకే కేంద్రంలో పరీక్ష రాసే అవకాశాలు ఇచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘డీఎస్సీ పరేషాన్’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రత్యేకించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో అధికారులు కేటాయించారు.
ఈ నెల 18, 20, 30 తేదీల్లో పరీక్షలు ఉన్నవారికి ఇలా కేంద్రాలను కేటాయించారు. దీంతో విద్యాశాఖ ఆ 14 మందికి ఒకే సెంటర్లో కేంద్రాన్ని కేటాయించింది. ఆయా అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ 14 మంది ఆన్లైన్లో పొందుపరిచిన సమాచారం సరిగ్గా లేనందున ఆయా అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టం ద్వారా దూరంగాకేంద్రాలను కేటాయించామని అధికారులు వివరణ ఇచ్చారు.
ఇలాంటి లోపాల సవరణకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో డీఎస్సీ స్టేట్ సెల్ నిరంతరం అందుబాటులో ఉన్నదని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులు 91541 14982, 6309998812 నంబర్‌ను సంప్రదించి సందేహాలు, సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. శనివారం వరకు 1,64,652 అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.