హసన్‌పర్తి/నయీంనగర్, జూలై 14 : భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువ దంత వైద్యురాలు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి కాకతీయ వింటేజ్కాలనీలో వెలుగుచూసింది. హసన్‌పర్తి సీఐ చేరాలు కథనం మేరకు.. వరంగల్ నగరం మట్టెవాడకు చెందిన తంజావూరి పద్మావతి కూతురు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష(35)ను ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన కార్డియాలజీ వైద్యుడు అల్లాడి సృజన్‌కు ఇచ్చి 2017లో వివాహంచేశారు. అప్పటినుంచి వారు హసన్‌పర్తిలోని కాకతీయ వింటేజ్కాలనీలో ఉంటున్నారు. తొమ్మిది నెలల క్రితం ఇన్‌స్టాలో బుట్టబొమ్మ పేరుతో రీల్స్ చేస్తూ పరిచయమైన యువతితో సృజన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
దీంతో సృజన్, ప్రత్యూష మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని అత్తామామలైన మధుసూదన్, పుణ్యవతికి చెప్పగా వారు కూడా ప్రత్యూషను ఇబ్బందులకు గురిచేశారు. ఆయువతి సైతం ప్రత్యూషకు ఫోన్ చేసి బెదిరించేది. ఈ క్రమంలో వారి వేధింపులకు తట్టుకోలేక ఆదివారం రాత్రి తన గదిలో చీరెతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి తల్లి పద్మావతి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నలుగురిపై సోమవారం కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ప్రత్యూషకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.