హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ): నల్లగొండ జిల్లా దేవరకొండ డిపో డ్రైవర్ శంకర్‌ను అధికారులు వేధించలేదని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడని వస్తున్న వార్తలపై స్పందించింది. శంకర్ ముందస్తు సమాచారం లేకుండా ఈనెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరైనట్టు తెలిపింది. తిరిగి ఆదివారం కూడా సెలవు కావాలని కోరగా, లీవ్ పొజిషన్ చూసి మంజూరు చేస్తామని చెప్పారని వెల్లడించింది. సెలవు ఇవ్వబోమని చెప్పలేదని స్పష్టం చేసింది.
అధికారుల వేధింపుల కారణంగానే పురుగుల మందు తాగుతున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్‌ల్లో శనివారం శంకర్ షేర్ చేసినట్టు చెప్పింది. దీంతో ఆయనను డిపో అధికారులు వెంటనే స్థానిక దవాఖానకు తరలించారని, అయితే ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు తేల్చి డిశ్చార్జి చేశారని తెలిపింది. గతంలోనూ శంకర్ ఇలాగే బెదిరింపులకు దిగాడని పేర్కొంది. తాజా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది.