HYDRAA | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పేద, మధ్య తరగతి గుండెల్లో అలజడి రేకెత్తించిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ).. జిల్లాలకూ విస్తరించనున్నదా? నగర బస్తీలపైకి దండెత్తిన బుల్డోజర్లు.. ఇక గ్రామీణ తెలంగాణలోని పేదల ఇండ్లపై పడనున్నాయా? రాష్ట్రమంతటా హైడ్రా వంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానమే వస్తున్నది. హైడ్రాను రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 3న సీఎం రేవంత్‌రెడ్డి మహబూబాబాద్ పర్యటనలో సూచించారు. పలువురు మంత్రులు సైతం జిల్లాలకు హైడ్రాను విస్తరిస్తామని ప్రకటనలు చేస్తూ వచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్రాంతంలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటుతో తమకు కలిగిన ‘ప్రయోజనాలను’ విశ్లేషించుకున్న ప్రభుత్వ పెద్దలు.. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలను విస్తరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తారని, ఆ తర్వాత వాటిని క్రమంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు (యూడీఏ) విస్తరిస్తారని సమాచారం. గతంలో యూడీఏల పరిధి కార్పొరేషన్ల చుట్టూ కొన్ని కిలోమీటర్లు మాత్రమే ఉండగా.. ఇటీవల వాటి పరిధిని కూడా విస్తరించడం గమనార్హం.
రాష్ట్రమంతా ఏకపక్ష కూల్చివేతలేనా?
ప్రభుత్వం జూలై 19న హైడ్రా ఏర్పాటు చేస్తూ, దానిని పరిధిని నిర్ణయిస్తూ జీవో 99 జారీ చేసింది. కానీ అనధికారికంగా జూన్‌లోనే కూల్చివేతలు మొదలుపెట్టింది. జూన్ 27న లోటస్‌పాండ్‌లోని పార్కు స్థలం ప్రహరీని కూల్చివేశారు. మొదట్లో అందరూ జీహెచ్ఎంసీ కూల్చివేతలుగానే దాన్ని భావించారు. కానీ ప్రభుత్వం అనధికారికంగా హైడ్రా కూల్చివేతలను ప్రారంభించిందని గుసగుసలు మొదలయ్యాయి. ఆ తర్వాత జూలైలో హైడ్రా కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ‘హైడ్రా’ ఏర్పాటును గొప్ప సంస్కరణగా ప్రజలకు చెప్పుకునేందుకు మొదట్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో మాత్రమే కూల్చివేతలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. ఆగస్టు 24న హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయడంతో హైడ్రాకు విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో బడా అక్రమార్కులపై సర్కారు హైడ్రాతో ఉక్కుపాదం మోపుతుందని అందరూ భావించారు. కానీ అది భ్రమేనని తేలిపోయింది. హైడ్రా తన అసలు రూపం చూపెట్టింది. పేద, మధ్యతరగతి ప్రజలపై పిడుగుపాటుగా మారింది. రామ్‌నగర్, అమీన్పూర్ చెరువు, సున్నం చెరువు, కత్వా చెరువు.. ఇలా నిరుపేదల ఇండ్లు, గుడిసెలను కూల్చివేసింది. ఇవన్నీ ఏకపక్షంగా కూల్చివేసినవేనన్నది బాధితుల ఆరోపణ.
సూర్యోదయానికే బుల్డోజర్లు వచ్చి పేదల ఇండ్లను నేలమట్టం చేశాయని, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు జరిపారని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు నివాసం ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ సందర్భంలో చెప్పారు. కానీ.. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు, మల్లంపేట పరిధిలోని కత్వా చెరువులో ప్రజలను బలవంతంగా బయటికి పంపి ఇండ్లను కూల్చివేశారు. కనీసం ఇండ్లల్లో ఉన్న సామాన్లను కూడా తీసుకునే అవకాశం వారికి ఇవ్వలేదు. ఇదే సమయంలో బడాబాబులు, రాజకీయ నేతల ఇండ్లపైకి, ఆక్రమణల వైపు మాత్రం హైడ్రా కన్నెత్తి చూడలేదనే విమర్శలున్నాయి. కేవీపీ వంటి రాజకీయ ప్రముఖులు, పొంగులేటి, ఇతర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని ఫాంహౌజ్‌లపై ఆరోపణలు వచ్చినా హైడ్రా పట్టించుకోలేదు. సీఎం రేవంత్ సోదరుడి నివాసానికి తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడమూ దుమారం రేపింది.
పేద, దిగువ మధ్యతరగతి ఉండే బస్తీలపై తెల్లారకముందే బుల్డోజర్లు పడి విధ్వంసం సృష్టిస్తే.. పెద్దల ఇండ్లకు మాత్రం ‘మీ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది., మీరే కూల్చుకోండి’ అంటూ కోరినంత గడువు ఇచ్చిందని అంటున్నారు. ఈ ఏకపక్ష కూల్చివేతలపై రాష్ట్ర హైకోర్టు సైతం తీవ్రంగా మండిపడింది. కోర్టు చెప్పినా కూల్చివేతలు ఆపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఈ ఏకపక్ష కూల్చివేతలేంది?. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు, చార్మినార్‌ను కూడా కూల్చేందుకు సిబ్బందిని పంపుతారా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ బాస్‌ల మాట వింటే జైలుకు వెళ్లేది మీరేనంటూ హైడ్రా కమిషనర్‌కు హెచ్చరించింది. అయినా హైడ్రా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణతో జిల్లాల్లోనూ ఏకపక్ష కూల్చివేతలు మొదలుకానున్నాయనే ఆందోళనలు పేద, మధ్యతరగతి ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పలు జిల్లాల్లో కూల్చివేతలు
కాంగ్రెస్ పాలనలో నిర్మాణాల కూల్చివేతలు హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో అక్రమ నిర్మాణాలంటూ ఆగస్టు 28న అర్ధరాత్రి 75 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఇవన్నీ దివ్యాంగులకు చెందినవే. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు, సాయుధ పోలీసు బలగాలతో రంగంలోకి దిగిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు అడ్డొచ్చిన వారిని చెదరగొడుతూ కూల్చేశారని బాధితులు వాపోయారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అక్రమం అంటే ఎలాగని మొత్తుకున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మూడు ఫంక్షన్‌హాళ్లకు నోటీసులు ఇచ్చారు. ఇందులో బీఆర్ఎస్ నేత, మున్సిపల్ కార్పొరేటర్ పెంట రాజేశ్‌కు చెందిన సిరి ఫంక్షన్‌హాల్‌ను ఈ నెల 5న అధికారులు కూల్చివేశారు. మల్లపు రాణి కుంట శివారులో అన్ని అనుమతులతో నిర్మించిన 16 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. జిల్లాలోని అనేక చెరువుల్లో సర్వే చేస్తున్నారు. బఫర్జోన్ల హద్దులు నిర్ణయిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లను రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులు రెండు నెలల క్రితం పరిశీలించారు. సిబ్బందితో వచ్చి పలు ఇండ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ కొలతలు తీస్తూ నంబర్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయని మండిపడ్డారు.
బస్తీలను కూల్చితే చూస్తూ ఊరుకోమంటూ ఎదురుతిరిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న రెండు ఇండ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సర్వేను అధికారులు సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీంతో అక్కడి కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. 50 ఏండ్లుగా అక్కడే బతుకుతున్నామని.. ఇప్పుడు కూల్చేస్తామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ నేతకు చెందిన ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఇంట్లో ఉన్నవారిని బలవంతంగా బయటికి పంపి, సామాగ్రిని బయట వేసి కూల్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ నెల 4న బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఇలాంటి కూల్చివేతలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జరుగనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విపక్ష నేతలకు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు చెందిన ఇండ్లే లక్ష్యంగా కొన్నిచోట్ల ఈ కూల్చివేతలు జరిగినట్టు స్పష్టమవుతున్నది. కానీ ఇకపై చెరువు బఫర్‌లోని పేదలు, మధ్యతరగతి కాలనీలే లక్ష్యంగా ఈ కూల్చివేతలు కొనసాగుతాయోమోనన్న ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
రాష్ట్రమంతటా ‘రియల్’ పతనమే
రాష్ట్ర రియల్ ఎస్టేట్‌కు గుండెకాయ లాంటి హైదరాబాద్‌పై ఇప్పటికే హైడ్రా పిడుగు పడింది. ఫలితంగా ప్రతినెల స్థిరాస్తి లావాదేవీలు పడిపోతున్నాయి. మూడు నెలలుగా రియల్ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తున్నది. నిరుడితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గుతూ వస్తున్నది. అక్టోబర్‌లోనూ ఇదే పతనం కనిపించింది. ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టు నాటికి స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 27.39 శాతం తగ్గగా, ఆదాయం ఏకంగా 30 శాతం పడిపోయింది. ఇక ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌కు పరిస్థితి మరింత దిగజారింది. రిజిస్ట్రేషన్లు 13 శాతం తగ్గగా.. ఖజానాకు రాబడి 28 శాతం తగ్గింది. సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో కేవలం రూ.20 కోట్లు అదనంగా వచ్చింది. కానీ నిరుడు అదే నెలతో పోల్చితే మాత్రం రూ.424 కోట్ల లోటు నమోదైంది. ఇలా జూలైలో హైడ్రా హడావుడి మొదలైనప్పటి నుంచి ప్రతినెల లావాదేవీల సంఖ్యలో సగటున 20 శాతం.. ఆదాయంలో 30 శాతం మేర తగ్గుదల కనిపిస్తున్నది.
జిల్లాల్లోనూ ఇప్పటికే క్రయవిక్రయాలు పడిపోయాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చెరువులు, కాలువలకు సమీపంలో ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, భూములు కొనడానికి సాధారణ జనం జంకుతున్నారని చెప్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో లేరని చెప్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, ప్రభుత్వం ఏదో వంకతో తమ ఇండ్లు కూల్చుతుందేమోనని సగటు జీవి ఆందోళనకు గురవుతున్నాడని వారు వాపోతున్నారు. పైగా హైడ్రా ఒంటికన్ను రాక్షసిలా వ్యవహరిస్తున్నదని.. బడా నేతల, ప్రముఖుల ఇండ్లను వదిలి, పేదల ఇండ్లపై దండెత్తుతున్నదని విపక్షం విమర్శిస్తున్నది. బెదిరింపుల దందా కోసమే ప్రభుత్వం హైడ్రాను వినియోగిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు హైడ్రా వంటి వ్యవస్థలను జిల్లాల్లోనూ ఏర్పాటు చేసే దిశగా సర్కారు యోచిస్తుండటం వివిధ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఇటు ప్రజానీకంతోపాటు అటు వ్యాపారవర్గాల్లోనూ ఈ ‘కూల్చివేతల’ అలజడి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
స్థానిక సంస్థలు నిర్వీర్యం
ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో అనుమతుల ప్రక్రియను హైడ్రా పర్యవేక్షిస్తున్నది. చెరువులు, నాలాలపైనా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. భవిష్యత్తులో హైడ్రా నుంచి ఎన్వోసీ తీసుకుంటేనే నిర్మాణాలకు అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇది జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారాలను గుంజుకోవడమేనని, టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేయడమేనని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం ద్వారా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల అధికారాలన్నీ గుంజుకొని, వాటిని నిర్వీర్యం చేసేలా ఎత్తుగడ వేస్తున్నారంటూ విశ్లేషిస్తున్నారు.
సీఎం నుంచి నేతల దాక.. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకూ విస్తరిస్తాం. చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం
జిల్లాల్లోనూ బుల్డోజర్!
ఆగస్టు 28
మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో అర్ధరాత్రి 75 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఇవన్నీ దివ్యాంగులవే.
సెప్టెంబర్ 5
పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూడు ఫంక్షన్‌హాళ్లకు నోటీసులు. అందులో బీఆర్ఎస్ నేత, కార్పొరేటర్ పెంట రాజేశ్‌కు చెందిన సిరి ఫంక్షన్‌హాల్‌ను కూల్చివేసిన అధికారులు.l సెప్టెంబర్ 27
ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్ల కొలతలు వేస్తున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర నిరసన తో అధికారుల బృందం వెనుదిరిగింది.
అక్టోబర్ 5
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లోని మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న రెండు ఇండ్లను అధికారులు కూల్చివేశారు.
సెప్టెంబర్ 25
సూర్యాపేటలోని సద్దుల చెరువు ఎఫ్టీఎల్ లోని ఇండ్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
సెప్టెంబర్ 20
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ నేత ఇల్లు కూల్చివేత.
నవంబర్ 4
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.