Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బండ్లగూడ, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్‌కు చెందిన చిరు వ్యాపారులు మాజీ మంత్రి హరీశ్‌రావు ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక కార్యక్రమం నిమిత్తం సోమవారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని కాళీమాత దేవాలయం మీదుగా హరీశ్‌రావు వెళ్తున్న సమయంలో మున్సిపల్ సిబ్బంది అక్కడ దుకాణాల కూల్చివేతలు చేపట్టారు. కాళీమాత ఆలయం వద్ద చిన్నచిన్న వ్యాపారాలతో పొట్టపోసుకుంటున్న సామాన్యులకు హరీశ్‌రావు వాహనాన్ని చూడగానే ప్రాణం లేచివచ్చింది. వెంటనే వారు ఆయన కారు ఆపి తమ గోడు వెళ్లబోసుకున్నారు. హరీశ్‌రావు వెంటనే కారు దిగి కూల్చివేతల వద్దకు వెళ్లి మున్సిపల్ సిబ్బందిని వారించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్‌తో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. సామాన్యుడు పొట్ట పోసుకునేందుకు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే వాటిని కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.
కాళీమాత దేవాలయం వద్ద 28 ఏండ్లుగా చిరు వ్యాపారులు చేసుకుంటున్నారని, ఇన్నాళ్లూ ఎవరూ వీరికి జోలికి రాలేదని హరీశ్‌రావు మున్సిపల్ అధికారులతో అన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వీటిని కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. ‘నోటీసులు ఇవ్వలేదు.. కనీసం వారికి సర్దుకునే సమయం ఇవ్యలేదు. దుకాణాల ముందు ఉన్న మెట్లు రోడ్డు మీదకు రాలేదు. అవి ఆక్రమణలు ఎట్ల అయితవి? మీరు కూలగొట్టేది మెట్లు కాదు.. వాళ్ల బతుకులను కూలగొడుతున్నరు. దుకాణాల్లోకి వచ్చే వాళ్లు ఎట్ల రావాలి? ఇప్పటికే హైడ్రా పేరుతో పేదల బతుకులు కూల్చివేశారు. ఆటో డ్రైవర్లు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఇప్పుడు దుకాణాలు కూలగొడుతున్నరు. వాళ్లు దందా ఎట్ల చేసుకోవాలి… కిరాయి ఎట్ల కట్టుకోవాలి.. కుటుంబాన్ని ఎట్ల పోషించుకోవాలి? ఇట్ల కూల్చివేస్తే దందాలు నడవక సచ్చిపోతరు. అర్థం చేసుకోండి’ అని వేడుకున్నారు. నిజంగా వాళ్లు రోడ్డు మీదకొచ్చి కడితే కూల్చేయండి… కానీ రోడ్డు అవతలికి ఉన్న వాళ్ల దుకాణాలను లోపలికి వచ్చి కూల్చకండి’ అని చెప్పారు. బాధితులతో మాట్లాడిన హరీశ్‌రావు తానున్నానని వారికి భరోసా కల్పించారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.