హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్ : హైదరాబాద్ గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు ప్రాంతం లో సోమవారం ఉదయం హైడ్రా పేదల గుడిసెల కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సియెట్ కాలనీలోని మొత్తం 72 గుడిసెలను హైడ్రా నేలమట్టం చేసింది. భూముల్లోని నిర్మాణాలను తొలగించింది. సామాన్లు తీసుకుంటామని వేడుకున్నా అధికారులు కనికరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 5గంటలకు కట్టుబట్టలతో బయటకు గెంటేశారని వాపోయారు.
తమ ఇల్లు అన్యాయంగా కూల్చారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భూమి పత్రాలు, కోర్టు ఆదేశాల డాక్యుమెంట్స్ పట్టుకుని జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా గుడిసెలు ఖాళీ చేయించం దారుణమని మండిపడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలరోజుల్లో ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులు నిర్ధారించాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించకుండా, హైడ్రా అధికారులు కూల్చివేతలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు.
భూముల వ్యవహారంపై కేసు కోర్టులో ఉండగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేంటని నిలదీశారు. హద్దులు నిర్ధారిస్తూ అక్కడ గుంతలు తవ్వడం చూసి బాధితులు భోరున విలపించారు. బుల్డోజర్లకు అడ్డం పడుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
నివాసాల కూల్చివేతల సందర్భంగా బాధితులు ప్రభుత్వం, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా డౌన్‌డౌన్.. ! రంగనాథ్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుడు సెప్టెంబర్ నుంచి హైడ్రా కూల్చివేతలపై న్యాయపోరాటం చేస్తున్న వెంకటేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు స్థానికంగా నీటి అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గుడిసెల తొలగింపుపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద, మధ్యతరగతి ప్రజల నివాసాలను కూల్చడమేంటని మండిపడ్డారు.
సున్నంచెరువును కబ్జా చేసినట్టు అధికారులు తమపై ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూములకు సంబంధించి.. 1956 నుంచి లింక్ డాక్యుమెంట్స్ తమవద్ద ఉన్నాయని తెలిపారు. కబ్జాను నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. తమ నివాసాలకు సంబంధించి.. ఇప్పటికీ అన్నిరకాల పన్నులు కడుతున్నామని చెప్పారు. ఇప్పటికీ ట్యాక్స్‌లు కట్టాలంటూ అధికారుల నుంచి సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఇండ్లు ఎలా కూలగొడ్తారని నిలదీశారు. సియోల్ కాలనీలో భూముల విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ భూములపై కన్నేశారని ఆరోపించారు. అందుకే తమను ఖాళీ చేయించేందుకు పంతం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నామని మండిపడ్డారు. గతంలో విజిలెన్స్ కమిషన్ చెప్పిన విధంగా రీసర్వే చేయాలని, అలా చేయకుండా ఇండ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం, హైడ్రాపై కోర్టుకు వెళ్లినందుకు తమపై మరింత కక్షకట్టినట్టుగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయం జరిగేవరకు పోరాడుతామని తేల్చిచెప్పారు.