హైదరాబాద్ : సికింద్రాబాద్ నల్లగుట్ట అగ్ని ప్రమాద భవనాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. గురువారం సాయంత్రం నుంచి భవనం కూల్చివేత పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం కూల్చివేత వల్ల పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రమాద సమయంలో అన్ని శాఖల అధికారులు సకాలంలో తగిన చర్యలు తీసుకోన్నారని వివరించారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పరిసర ప్రాంత ప్రజలను మున్నూరు కాపు సంఘ భవనంలోకి తరలించి వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు.
భవనాన్ని కూల్చేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కూల్చివేత పనులు సాయంత్రం ప్రారంభం అవుతాయని అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, తహసీల్దార్ శైలజ, ఈఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.