అమీన్పూర్, మే 30 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947 శెట్టికుంట ఎఫ్టీఎల్, బఫర్ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ..శెట్టికుంట బఫర్, ఎఫ్టీఎల్ స్థలాల్లో 10 వరకు కట్టడాలను గుర్తించి పనులను అపాలని సంబంధిత వ్యక్తులకు సమాచారమిచ్చినా వారు స్పందించక పోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు భద్రతతో సదరు నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మున్ముందు ప్రభుత్వ సర్వే నంబర్లు 1000, 1112, 994, 630, 993, 947, 32 పరిధిలోనూ అక్రమ కట్టడాలను గుర్తించి ఉన్నతాధికారుల అనుమతితో కూల్చివేతలకు పూనుకుంటామని స్పష్టం చేశారు.