హసన్‌పర్తి, జూన్ 20 : నిద్రిస్తున్న పేదల గుడిసెల మీదికి రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు ఒక్కసారిగా బుల్డోజర్లతో వచ్చి ధ్వంసంచేశారు. సీపీఐ ఆఫీసును నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా గ్రేటర్ 2 డివిజన్ పరిధిలో లిక్కర్ప్లాంట్ సమీపంలోని గుండ్లసింగారంలో ఐదేండ్ల నుంచి పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రిస్తున్న పేదల గుడిసెల మీదకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతోపాటు 200 మంది పోలీసులు బుల్డోజర్లతో వచ్చి గుడిసెలు, అందులో ఉన్న సీపీఐ ఆఫీసును కూ ల్చివేశారు. అడ్డువచ్చిన సీపీఐ నాయకులు 30 మంది ని అరెస్ట్‌చేసి కేయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కట్టుబట్టలతో.. ఎర్రటెండలో పిల్లలను పట్టుకొని తాగునీళ్లులేక ఆకలితో గుడిసెవాసులు అలమటించా రు.
ఈ ఘటనలో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. పైసాపైసా కూడబెట్టుకొని వేసుకున్న గుడిసెలు కండ్ల ముందే కూల్చుతుంటే పేదల గుండెలు పగిలాయి. రూ.రెండు కోట్ల వరకు నష్టం జరిగింది. విషయం తెలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుండ్లసింగారంలో పర్యటించి, గుడిసెవాసులను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూకబ్జాదారులు ఆక్రమించిన భూములను రికవరీ చేయాలని, పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చడమేంటని ప్రభుత్వంపై మండిపడ్డారు. హనుమకొండ, వరంగల్‌లోనే ప్రభుత్వం కూల్చమంటున్నదా.. అని ప్రశ్నించారు. పేదల భూములను బడాబాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కూల్చిన గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.