Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అది 2008 డిసెంబర్ 28. నగరం నడిబొడ్డున గాంధీ భవన్‌కు పక్కనే ఉన్న భీంరావ్‌బాడ. కాయకష్టం చేసే నిరుపేద కూలీలు గుడిసెలు, చిన్నపాటి ఇండ్లు నిర్మించుకొని కుటుంబాలతో జీవిస్తున్న 1933 సంవత్సరం నాటి బస్తీ. పొద్దంతా కాయకష్టం చేసినందున అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా కరెంటు పోయింది (అధికారులే సరఫరాను నిలిపివేశారు). పోలీసు బలగాలు బస్తీని చుట్టుముట్టడం మొదలుపెట్టాయి. వారి రక్షణలో బుల్డోజర్లు నెమ్మదిగా బస్తీవైపు కదిలాయి. ఈ అలికిడితో బస్తీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకేముంది! ఒకవైపు పోలీసులు ఆ నిరుపేదల్ని ఇంట్లో నుంచి బయటికి గుంజిపడేస్తుంటే, మరోవైపు బుల్డోజర్లు ఆ ఇండ్లను నేలమట్టం చేసుకుంటూ పోతున్నాయి. వందలాది మంది పోలీసులను నిలువరించలేక ఆ నిరుపేదలు రోడ్డునపడి రోదించారు.
దివంగత పీజేఆర్ కుమారుడు, అప్పటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి శాయశక్తులా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఈడ్చిపడేశారు. బుల్డోజర్ల కింద నలగకుండా దక్కిన సామాను తీసుకొని ఆ నిరుపేద కుటుంబాల వృద్ధులు, పిల్లలతో రోడ్డునపడ్డారు. చివరకు వారిని కనీసం మంచినీటి వసతి కూడా లేని వాంబే ఇండ్ల సముదాయంలోకి తరలించారు. ఆ నిరుపేదలకు 1995లో అప్పటి స్థానిక, ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలోనే ఇండ్ల పట్టాల పంపిణీ జరిగింది. కరెంటు మీటర్లు, మంచినీటి కనెక్షన్లు, రేషన్‌కార్డులు ఇచ్చారు. అదే చిరుమానాపై ప్రభుత్వ పథకాల అమలు కూడా జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా ఆ నిరుపేదల ఇండ్లను కూల్చింది. 2006 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ బస్తీపై కక్షగట్టడంతో బస్తీవాసులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టేను కొనసాగించుకోవాలనే అవగాహన బస్తీవాసుల్లో పెద్దగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని అప్పటి కాంగ్రెస్ సర్కారు స్టే వెకేట్ అయిన రోజు అర్ధరాత్రి బుల్డోజర్లతో విరుచుకుపడింది. నగరం నడిబొడ్డున ఉండటంతో అప్పటివరకు వారికి ఉపాధి లభించేది. పిల్లల చదువులకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ అక్కడి నుంచి తరలిపోయిన తర్వాత ఆ కుటుంబాల చెల్లాచెదురై, నరకయాతన అనుభవిస్తున్నాయి.
కార్యాలయం కోసమే దమనకాండ
ఇంతకీ ఆ నిరుపేదల గూడును బుల్డోజర్ల కింద తొక్కించేందుకు కారణం ఏమిటో తెలుసా? అక్కడ ఇందిరా భవన్ పేరిట కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడమే. పేదల ఇండ్లను కూలగొట్టి అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని ఈ దమనకాండకు ప్రభుత్వం పాల్పడింది. ఆ ఘటనకు మరో నెల రోజుల్లో పదహారు సంవత్సరాలు నిండుతాయి. కానీ, ఇప్పటిదాకా ఇందిరా భవన్‌ను నిర్మించిందీ లేదు, ఆ స్థలాన్ని ఇతర ప్రజా ప్రయోజనాలకు వినియోగించిందీ లేదు. అటు పేదలకు దక్కలేదు. చివరకు ప్రభుత్వం వాడుకోలేదు. కానీ 75 సంవత్సరాలనాటి బస్తీ కాలగర్భంలో కలిసిపోయింది. మూసీ సుందరీకరణ పేరిట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిరుపేదల ఇండ్లను కూల్చి ఆకాశహర్మ్యాలు నిర్మిస్తానని చెప్తుండడంతో ప్రస్తుతం భీంరావ్‌బాడ దీనగాధను హైదరాబాద్ నగరం నెమరేసుకుంటున్నది.
భీంరావుబాడలో వంద కుటుంబాలు
సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి నిరుపేదలు నగరానికి వలస వచ్చి నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవించేవారు. దీంతో 1933లోనే అక్కడ భీంరావుబాడ అనే బస్తీ ఏర్పడింది. నాంపల్లిలో నిర్మాణరంగ కూలీల అడ్డా ఉన్నందున అక్కడికి సమీపంలోనే ఉపాధి దొరుకుతుందనే ఆశతో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా సుమారు 1100 చదరపు గజాల స్థలంలో దాదాపు వంద కుటుంబాల వరకు అక్కడ స్థిరపడ్డాయి. నాటి ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 1995 సంవత్సరంలో వీరికి పట్టాలను కూడా పంపిణీ చేశారు. రేషన్‌కార్డులతో పాటు విద్యుత్తు, మంచినీటి కనెక్షన్లు కూడా పొందారు. నగరం నడిబొడ్డున ఉండటంతో వారికి మంచి ఉపాధి లభించేది. పిల్లల్ని పాఠశాలలకు పంపడంతో పాటు పైసాపైసా కూడబెట్టుకొని కొందరు గుడిసెల స్థానంలో చిన్నపాటి ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. ఇంట్లో టీవీ, కొంతమేర ఫర్నిచర్‌తో ఆ కుటుంబాలు అక్కడ సంతోషంగా జీవించాయి.
కన్నేసిన కాంగ్రెస్
గాంధీభవన్ పక్కనే ఉండటంతో పాటు ప్రధాన నగరంలో ఉండటంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఆ స్థలంపై కన్నుపడింది. 2004లో అధికారంలోకి రాగా 2006లోనే ఆ బస్తీ నుంచి నిరుపేదల్ని వెళ్లగొట్టి గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాలయానికి ఇందిరాభవన్ అని నామకరణం చేసి శిలాఫలకాన్ని కూడా తయారు చేయించారు. అయితే బస్తీవాసులకు దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ అండగా నిలిచారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నిరుపేదల గూడును కూల్చివేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో బస్తీవాసులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది. దీంతో బస్తీవాసులు ఇక తమకు ఇబ్బందిలేదని నిశ్చింతగా ఉండిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉంది. స్టే గడువు ముగిసే విషయంపై ఆ నిరుపేదలకు పెద్ద అవగాహన లేదు. దీనిని అదునుగా చేసుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి వందలాది మంది పోలీసులు, బుల్డోజర్లతో బస్తీపై విరుచుకుపడింది. ఇంట్లో సామాను తీసుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా కొన్ని గంటల వ్యవధిలోనే పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. అప్పటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సర్కారు దమనకాండను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి, నిరసన వ్యక్తం చేశాయి.
పార్కింగ్ కోసం వినియోగం
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్థలం అటు నిరుపేదలకు, ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడకుండా రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాభవన్ ఊసే మరిచిపోయింది. తిరిగి ఆ కుటుంబాలు వద్దామంటే ఉన్న గుడిసెలు, ఇండ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. నుమాయిష్ జరిగినపుడు పోలీసులు ఆ స్థలాన్ని పార్కింగ్ స్లాటుగా వినియోగిస్తున్నారు. పరిసరాల్లో గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, ఇతర కార్యాలయాలు ఉండటంతో చాలామంది అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు బస్తీవాసులు ఇప్పటికీ ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని డిమాండు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఏం సాధించినట్టు?
ప్రశాంతంగా ఉన్న బస్తీని చెదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఏం సాధించినట్టు? ఇప్పటికీ సమాధానంలేని ప్రశ్న ఇది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో వేలాది నిరుపేదల ఇండ్లు కూల్చివేస్తామని చెప్తున్నది. వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటున్నది. పేదల ఇండ్లు కూల్చివేసిన చోట ఆకాశహర్మ్యాలు నిర్మించి హైదరాబాద్‌ను సియోల్గా మారుస్తామని అంటున్నది. ఈ క్రమంలో ప్రభుత్వపరంగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) ప్రాతిపదికన కార్పొరేట్ కంపెనీలకు తివాచీ పరిచి వాళ్లు పెట్టే పెట్టుబడులతో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం, మంత్రులు పేర్కొంటున్నారు. మూసీ మురికిని పోగొట్టేందుకు పేదల ఇండ్లను కూల్చడమెందుకు? అని ప్రశ్నించిన వారిని నల్లగొండ జిల్లావాసులకు మీరు వ్యతిరేమా? అని ఎదురు దాడికి దిగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, సుందరీకరణ కోసం కూల్చివేస్తామని చెప్తున్న ఆ ఇండ్లు హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన వారివి కావు. అందులో చాలామంది ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వచ్చి పైసా పైసా కూడబెట్టుకొని, గ్రామాల్లో ఉన్న తమ పొలాలను అమ్ముకొని నిర్మించుకున్నవి. ఈ క్రమంలో తదుపరి కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ కొలువు తీరకపోతే, ఆ భూములు అటు బాధితులకు దక్కక, ఇటు ప్రభుత్వపరంగా ఉపయోగపడకుండా మరో భీంరావ్‌బాడ స్థలంగా మారుతాయా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నది.
నేటికీ కొనసాగుతున్న పోరాటం
భీంరావుబాడ నుంచి ఆ నిరుపేద కుటుంబాలను అదే నియోజకవర్గం పరిధిలో ఉన్న అఫ్జల్‌సాగర్‌లోని వాంబే గృహాలకు తరలించారు. అక్కడ మంచినీటి వసతి, డ్రైనేజీ, సరైన కరెంటు సరఫరా, రవాణా మార్గం వంటి కనీస మౌలిక వసతులు కల్పించకుండానే ఆ కుటుంబాలను అక్కడికి తరలించారు. వాంబే గృహాలకు సంబంధించి అప్పుడు పట్టాలు కూడా వారికి ఇవ్వలేదు. ఉపాధి కేంద్రంగా ఉన్న నాంపల్లి కూలీ అడ్డా దూరం కావడం, పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదుర్కోవడం, మౌలిక వసతులు లేకపోవడంతో ఆ కుటుంబాలు నరకయాతన అనుభవించాయి. తిరిగి న్యాయ పోరాటం చేసి స్టే తెచ్చుకున్నాయి. ఈలోగా రెవెన్యూ శాఖ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసింది. తదనంతరం సీఎంగా ఉన్న వైఎస్ చనిపోవడంతో ఇందిరాభవన్ ప్రతిపాదన అటకెక్కింది.