High Court | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగం ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాల తొలగింపునకు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులకు పిటిషనర్లు తమ వద్ద ఉన్న వివరాల ఆధారాలను సంబంధిత అధికారులకు చూపించాలని తెలిపింది. ఆధారాలను పరిశీలించాకే చర్యలు తీసుకోవాలని తెలిపింది. శేరిలింగంపల్లి మండలం గుట్టబేగంపేటలో 58.08 ఎకరాల్లో 280 ప్లాట్లతో వేసిన లేఔట్లలోని స్థలాలను కొనుగోలు చేసి 1998లో ఇండ్లు నిర్మించుకున్నవాళ్లను తొలగించేందుకు వాల్టా చట్టంలోని సెక్షన్-23 కింద డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వాటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల న్యాయవాదులు వాదిస్తూ.. 1998లో వేసిన లేఔట్‌లోని ప్లాట్లలో ప్రభుత్వ శాఖల అనుమతులతో ఇండ్లను నిర్మించుకున్నారని వివరించారు. నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండానే ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, వాటిని తొలగించేస్తామని నోటీసులు ఇచ్చారని తెలిపారు. కావూరిహిల్స్లోని అపార్టుమెంట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్తున్నారని, వాటిని తొలగించాలంటూ ఈ నెల 3న నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలను తొలగించాలంటూ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను షోకాజ్లుగా పరిగణిస్తామని, గడువులోగా పిటిషనర్ల వివరణ తీసుకుంటామని చెప్పారు. ఇందు కు హైకోర్టు అనుమతి ఇస్తూ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.