KTR | కూల్చివేతలే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. హైడ్రా కూల్చివేతలు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ రాజ్యం అన్నరు. ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తరని ప్రజలు ఓట్లు వేశారు. ఇందిరమ్మ ఇండ్లని మీరే చెప్పారు. కానీ, పేదల ఇండ్లుకూలగొడతమని చెప్పుంటే ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండెనా..? ఒక్కసారి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి మూడునాలుగు రోజులుగా మీడియాకు మొఖం చాటేశాడు. లేకపోతే మీడియాతో చీట్చాట్లు చేసేవాడు. ఇప్పుడు చేస్తలేడు. ఎందుకు? భయం. అవతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అధికారులను ముంగట పెడుతున్నరు. అమెరికా వెళ్లి బోగస్ కంపెనీలు తెచ్చిండు వాళ్ల అన్నగాడు. వెయ్యికొట్ల పెట్టుబడి పెట్టే మొగాడు ఎప్పుడైండు.. అన్నిపైసలు యాడికేలి వచ్చినయ్.. రేవంత్ పంపి అక్కడికేలి తెప్పిస్తున్నడా? అని సోషల్ మీడియాలో రాంగనే ఏం చేయాలి.. జయేశ్ రంజన్ రావాలి. రామకృష్ణరావు వచ్చి సంజాయిషీ ఇవ్వాలి. ఇవాళ హైదరాబాద్ మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎలా చేస్తరంటే.. ఓ దాన కిశోర్, ఓ రంగనాథ్ రావాలి. ఎందుకు నీ మంత్రులు ముందటికి రావడం లేదు’ అంటూ ప్రశ్నించారు.
‘మంత్రులు వచ్చి మూసీ గొప్పదనం ఎందుకు చెప్పడం లేదు. మూసీ ఎంత జనరంజక ప్రాజెక్టు.. అద్భుతమైన ప్రాజెక్టో.. రాష్ట్రం ఎంత మురిసిపోతదరి.. ఎన్ని అద్భుతాలు జరుగతయో ఎందుకు చెప్పడం లేదు. చేతకావడం లేదా? లేక సరుకులేదా? వాస్తవాలు చెప్పేధైర్యం లేక.. అధికారుల వెనుక దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి. అసలు మేనిఫెస్టో చెప్పు. నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు. వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. 300రోజులకు కూడా.. ఏం చేయని నీ అశక్తతను చెప్పు. మరి ఎందుకు ఎవడి కోసం ఈ కూల్చివేతలు.. ఎవడి కోసం రూ.1.50లక్షల కోట్లు చెప్పాలి. ఇవాళ ఒక్కొక్క బాధితుడు చెబుతుంటే.. ఏడుస్తుంటే.. చిన్న పిల్లలు ప్లకార్డులు పట్టుకొని బడి బంద్ చేసి రోడ్లెక్కితే ఓ మంత్రి అంటున్నడు. రూ.5వేల కోసమట సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారటా.. అందరూ కాంగ్రెసోళ్ల లెక్క ఉండరు. రూ.50కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం.. రూ.500కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం.. మంత్రులు పర్సంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం.. మీ కాంగ్రెస్ మాదిరిగా దిక్కుమాలిన అలవాట్లు తెలంగాణ బిడ్డలకు అస్సలు ఉండవు’ అన్నారు.
‘ఆత్మగౌరవంపై కొడితే.. ఆత్మగౌరవం విషయానికి వస్తే మంత్రి శ్రీధర్‌బాబు.. తెలంగాణ ప్రజలు తిరగబడితే గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది. మీరంటే గౌరవం ఉన్నది. చదువుకున్న వ్యక్తి.. సంస్కారవంతంగా మాట్లాడుతారనే గౌరవం ఉండేది. కానీ, మీ మాటలతో పోతున్నది. మొన్న ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నదరు అని అతితెలివి. నిన్ననేమో రూ.5వేల కోసం సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నరని మాట్లాడతావా? నువ్వుపోయి వాళ్ల ఇంటిపై పడి ఇండ్లు కూలగొడుతామంటే దేవుడచ్చిండని మొక్కుతరా? ఇవాళ అందరూ ఏడుస్తున్నరు. బీపీలు పెరిగి.. షుగర్లు పెరిగి.. ఈఎంఐలు ఎలా కట్టాలి.. మరి మా పరిస్థితి ఏంది? కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలగొడుతున్నరని ఆరోగ్యాలు దెబ్బతింటున్నయ్. గర్భిణులు ఏడుస్తుంటే.. చిన్నపిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే ఆ మాటలు అనడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? సంస్కారం ఉన్నోడివి.. చదువుకున్నోడివి గౌరవం ఉండేది. సహవాస దోషం అనుకుంటా.. ఓటుకు నోటు దొంగల పక్కనే కూర్చొని నువ్వు అలాగే అయిపోయినవ్. శ్రీధర్‌బాబు కూడా చెడిపోయిండు. ఇది మంచిది కాదు. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ చనిపోయింది వాస్తవం కాదా? మా నాయకులు హరీశ్‌రావు, సబితక్క, తలసాని గాంధీకి వెళ్తే అడ్డుకున్నది వాస్తవం కాదు. చిన్నపిల్లల ఆవేదన రోజూ కనిపిస్తలేదా? హైకోర్టుకు అర్థమైంది.. నీకు అర్థం కావడం లేదా? ఆయనను తిడుతున్న తిట్లు మాకే మంచిగ అనిపిస్తలేదు. అలాంటి తిట్లు వినలేదు. చూడలేదు. భయం వేస్తుంది. పొరపాటున కాంగ్రెసోళ్లు అటువైపుగా వెళ్లకండి ముందే చెబుతున్న. దానికి మా బాధ్యత కాదు. ప్రజలు విపరీతమైన కోపంలో ఉన్నారు’ అంటూ హెచ్చరించారు.
‘కాకపోతే ఒకటిమాత్రం పక్కా. ఇవాళ వేలాది కుటుంబాలను రోడ్డునపడేసి.. లక్షలాది నిరాశ్రయులను చేసి.. పేద, మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్‌లను కూలగొడుతానంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడుతాం. మా నాయకులు వారికి మాట ఇచ్చివచ్చారు. మా ఎమ్మెల్యే సుధీర్ చైతన్యపురిలో చెప్పడం నేను చూశా. బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా మేం అందరం చెబుతున్నాం. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నేతలం అందరం నాతో సహా నిల్చుంటాం. అడ్డుకుంటాం అని చెబుతున్నది. ఇది మంచిది కాదు. మీరిది చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటది. మొదట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఆరు గ్యారంటీలు అమలు చేయండి. రైతు రుణమాఫీ పూర్తి చేయ్. ఆరు గ్యారంటీలు అమలు చేసి.. అందరి ఖాతాల్లో డబ్బులు వేయ్. ఆ తర్వాత రూ.1.50లక్ష కోట్లు నీ అయ్య జాగీరా? నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడతా అనడానికి.. ప్రజల సొమ్ము అది. నువ్వు ఉంటప్ పోతవు రేపు. రూ.1.50లక్షల కోట్లు నీ విలాసాలకు.. కాస్మోటిక్ హంగులకు వెచ్చిస్తావా? పేదప్రజలు చస్తుంటే.. గూడుచెదిరి ఏడుస్తుంటే.. నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టు చేస్తానంటే.. ఎవడి కోసం చేస్తావ్.. ఎట్లా చేస్తవ్.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా? అందుకే ప్రజాకోర్టులోనూ ఎండగడుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం’ అన్నారు.