Danam Nagender | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : పెదవి దాటే మాట.. రంగు మారే కండువా.. వెనక్కి తీసుకోవాలంటే అంత సులువు కాదు! కలిసొస్తే పూలబాటనే… బూమరాంగ్ అయిందో!! కుంపటి మీద కూర్చున్నట్టే.. నిత్యం అంతర్మథనం తప్పదు. మరో మాటలో చెప్పాలంటే.. పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి ఇలాగే ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంగీ మార్చినంత ఈజీగా పార్టీ కండువా మార్చారు. కానీ హస్తం ఆశించిందొకటి.. దానం కోరుకున్నది మరోటి. పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటు కోసం నాగేందర్‌ను ఒక పావులా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబోలు. కలిసొస్తే ‘హస్తిన’వాసి.. కాకపోతే ఇక్కడ అధికారదర్పం దక్కుతుందని దానం కూడా ఊహించినట్లున్నరు. అందుకే కండువా మార్చిన కొత్తలో ఆయన ఆవేశపడి మాటలు పేల్చేవారు. ఆ తర్వాత ఎంపీ పదవి దక్కకపోగా.. ఇటు అధికారదర్పం పేరుకే పరిమితమైంది. కనీసం ఒక్క అధికారి కూడా మాట వినకపోవడం ఒకవంతైతే.. సొంత నియోజకవర్గంలోని పార్టీలో రెండు బలమైన వర్గాలు ఆయన పాత్రను నామమాత్రం చేశాయి. ప్రభుత్వంపై అసంతృప్త రాగాలు ఆలపిస్తున్నా అత్యంత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కదా! పట్టించుకునే దిక్కే లేకుండాపోయింది. తాజాగా చింతల్‌బస్తీ కూల్చివేతల సందర్భంగా అధికారులెవరూ తన మాట వినకపోవడంతో ఓ పది నిమిషాల పాటు హైడ్రామా చేసి జారుకోవాల్సి వచ్చిందంటూ ‘ఎక్స్’ కోడై కూస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గోడ దూకి అధికార పార్టీ కండువా కప్పుకున్న దానం నాగేందర్ గత కొంతకాలంగా తీవ్రంగా సతమతమవుతున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలోని నందగిరి హిల్స్వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా గురుబ్రహ్మనగర్ బస్తీలోని గుడిసెలకు దారి విషయంలో హడావుడి చేసింది. ఆ సందర్భంగా హైడ్రా కమిషనర్ వర్సెస్ దానం నాగేందర్ అన్నట్టు కొద్ది రోజులు హైడ్రామా నడిచింది. కానీ దానం ఆశించినట్టు అధికారపక్షం నుంచి ఆయనకు మద్దతు లభించలేదు. దీంతో నారాజ్ అయిన దానం నాగేందర్ తాను థర్టీ ఇయర్ ఇన్ పాలిటిక్స్.. ఇలాంటి అధికారులు వస్తుంటారు! పోతుంటారు!! అంటూ గొంతెత్తారు. ముఖ్యంగా హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చివేస్తే మన కొంపనే మునుగుతుందంటూ అధికార పార్టీపై అసంతృప్తి గళం వినిపించారు. తాజాగా బుధవారం చింతల్‌బస్తీలో ట్రాఫిక్ పోలీస్-జీహెచ్ఎంసీ సంయుక్తంగా రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను కూల్చివేశారు. ఇండ్లు కోల్పోయిన వారంతా రోజువారీగా పొట్టపోసుకునే చిరు వ్యాపారులే. దీంతో అక్కడకు వచ్చిన దానం నాగేందర్ ఒకింత ఆవేశానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నోటీసులో లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆపకపోతే ఇక్కడే బైఠాయిస్తా.. ఎమ్మెల్యే పదవి పోయినా సరే జేసీబీకి అడ్డంగా కూర్చుంటానని హెచ్చరించారు. ‘దావోస్‌లో ఉన్న సీఎం వచ్చే వరకు రెండ్రోజులు ఆగండి.. ప్రజలకు నేను కదా సమాధానం చెప్పుకోవాల్సింది… కూల్చివేస్తే బాగుండదు..’ అంటూ ఘాటుగా మాట్లాడారు. కానీ ఇదంతా పది నిమిషాల్లో ముగిసింది. అధికారులు మాత్రం క్షణం పాటు కూడా కూల్చివేతలు నిలిపివేయలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో దానం నాగేందర్ వ్యాఖ్యలు… కొనసాగుతున్న కూల్చివేతలపై నెటిజన్లు సెటైర్లు వేశారు. పార్టీ మారినప్పటికీ దానం మాటలు ఏ ఒక్క అధికారి వినడంలేదంటూ చురకలు అంటించారు. ముఖ్యంగా పది నిమిషాలపాటు హడావుడి చేసిన దానం నాగేందర్ ఆ వంక కన్నెత్తి చూడలేదంటే తన మాట ఎవరూ వినడంలేదనే నిర్వేదంలోకి వెళ్లి, మళ్లీ ‘థర్టీ ఇయర్ ఇన్ పాలిటిక్స్’ అనే రాగం అందుకోక తప్పలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లోనూ దానంది ఇదే పరిస్థితి అని పార్టీవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన విజయారెడ్డి వర్గానికి దానం అంటే పడదు. దీంతో ఎమ్మెల్యే లేకుండానే ఆమె అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. పైగా విజయారెడ్డి డివిజన్లో ప్రారంభోత్సవమైనా, శంకుస్థాపన అయినా ఒకే పనికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ తెలిసిందే. మరోవైపు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వర్గం కూడా ఎమ్మెల్యేకు ధీటుగా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుందని, ఆ వర్గం అంతా పార్టీ సీనియర్ నేత రోహిన్‌రెడ్డి వైపు ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక అధికారుల పోస్టింగ్‌ల్లో ఆయన పరిస్థితి సంక్లిష్టంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు శాఖకు సంబంధించి ఒక్క పోస్టింగ్‌లో కూడా ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో పాటు తన అనుచరులపైనే కేసులు నమోదు అవుతుండటం దానం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్నిరోజుల కిందట ఒక ఇంటర్వ్యూలో పోలీసు ఉన్నతాధికారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు
ఖైరతాబాద్/సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాల పేరిట జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వందకుపైగా దుకాణాలను కూల్చివేశారు. సుమారు 145 మంది సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల నుంచి కూల్చివేతలను చేపట్టారు. గత 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ బతుకుదెరువు సాగిస్తున్న తమ షాపులను తొలగిస్తే రోడ్డునపడుతామంటూ స్థానికులు రోదించినా.. అధికారులు కూల్చివేతలను ఆపలేదు. ఇన్నాళ్లు తమకు ఉపాధినిచ్చిన నిర్మాణాలు కండ్ల ముందే కూలుతుంటే బాధతులు కన్నీరుమున్నీరయ్యారు. తాము ఏం పాపం చేశామని తమపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష కట్టాడంటూ రోదించారు.