ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26: రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల్లో ఎఫ్టీఎల్ విస్తీర్ణం, బఫర్జోన్ల విస్తీర్ణంను గుర్తించి ప్రత్యేకంగా మ్యాప్‌లను తయారుచేస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటలున్నాయి. దాదాపు 600 నుంచి 650 వరకు చెరువులు, కుంటలున్నాయి.
ఇందులో మొదటి దశలో మేజర్ చెరువు, కుంటలను ఎంపికచేసి ఆ చెరువు సర్వేనెంబర్ల ఆధారంగా ఎఫ్టీఎల్లో ఎంతభూమి ఉంటుంది. ఆపైన బఫర్‌జోన్‌లో ఎంత భూమి ఉంటుందనే విషయాన్ని మ్యాప్‌ల రూపంలో గుర్తిస్తున్నారు. 2014 సంవత్సరంలో హెచ్ఎండీఏ ‘ఆర్వీ’ అనే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను సాటిలైట్ ఆధారంగా గుర్తించింది. అప్పుడు నిర్దేశించిన ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధినే మరోసారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాప్‌లను తయారుచేస్తున్నారు.
ముఖ్యంగా జిల్లాలోని అర్బన్ మండలాల్లో ఉన్న చెరువు, కుంటల్లో సుమారు 250 నుంచి 350 చెరువుల వరకు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణకు గురైన చెరవుల సర్వేనెంబర్ల ఆధారంగా ఎఫ్టీఎల్లో ఎంత భూమి వస్తుంది. బఫర్‌లో ఎంత భూమి ఉంటుందని మరోసారి గుర్తించి హైడ్రా అధికారులకు అప్పగించనున్నారు.
రంగారెడ్డిజిల్లా పరిధిలో అర్బన్ ఏరియాలోగల అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, బాలాపూర్, కందుకూరు, కొత్తూరు, ఫారుక్‌నగర్, షాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట్ వంటి మండలాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. మొదటి దశలో ఈ మండలాల్లో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే చెరువులను ప్రత్యేకించి పరిశీలిస్తున్నారు. ఈ చెరువుల వద్ద బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తిస్తున్నారు.
మరో పదిహేను రోజుల్లో వీటిని గుర్తించి ఫైనల్‌లిస్ట్ తయారుచేసి అధికారులకు అందజేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికై హైడ్రా అధికారులు ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువును, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తుర్కయంజాల్ మాసబ్చెరువును పరిశీలించారు. ఔటర్లోపలి గ్రామాల్లోనే హైడ్రా కూల్చివేతలుంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఔటర్ వెలుపలి ప్రాంతాల్లో కూడా హెచ్ఎండీఏ అధికారులు పర్యటిస్తూ చెరువులను పరిశీలిస్తున్నారు. మరోవైపు హైడ్రా అధికారుల తీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే మండలాలు శేరిలింగంపల్లి, మొయినాబాద్, కందుకూరు, షాబాద్, నందిగామ, ఫారుఖ్‌నగర్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, గండిపేట్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, యాచారంలో కొంతభాగముంది. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.