హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ గందరగోళంగా సాగుతున్నది. నవంబర్ మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 కూడా పూర్తిచేయలేకపోయారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముంచుకొస్తున్న తరుణంలో అధికారుల్లో ఒత్తిడి పెరుగుతున్నది. అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేయలేకపోతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల హద్దులపై హైకోర్టు ఆదేశించేంత వరకు చోద్యం చూసిన యంత్రాంగం.. ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నది.
ఏడు జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల హద్దులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కానీ, ఇప్పటి వరకు బఫర్, ఎఫ్టీఎల్ జోన్ ప్రాంతాన్ని నిర్ధారణ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో చెరువు భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల అన్యాక్రాంతంపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ చేయమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నవంబర్‌లోగా ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ ఈ అంశాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ సీరియస్ తీసుకోకపోవడంతో గడువు దగ్గర పడుతున్నా ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. ఇప్పటివరకు 2,525 చెరువులకు మాత్రమే ప్రాథమికంగా హద్దులు ఖరారు చేశారు. ఇందులో 230 చెరువులకు మాత్రమే పూర్తిస్థాయి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించారు. మిగిలిన 1,000 చెరువులకు కనీసం బఫర్జోన్లను కూడా నిర్ధారించలేదు.
లోపించిన సమన్వయం..
చెరువు హద్దుల నిర్ధారణలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఇచ్చే మ్యాపులను మాత్రమే హెచ్ఎండీఏ ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ, హెచ్ఎండీఏ చేసిన సర్వే ఫలితాలు వాటికి భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హద్దుల వివాదానికి కారణమైందనే విమర్శలు ఉన్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల రికార్డులు, హెచ్ఎండీఏ సేకరించిన వివరాల మధ్య భారీ వ్యత్యాసంతోనే ఏ ఒక్క చెరువు విషయంలోనూ వాస్తవ హద్దులను పూర్తిస్థాయిలో నిర్ధారించలేదు.