అన్నం పెట్టే రైతన్నపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టినట్టు చేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా మొండికేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయి అన్నదాతల్లో రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతున్నది. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో వడ్లు, మక్కల కుప్పలు నిండిపోయి వాటిని కొనేవారు లేక రైతాంగం దిక్కులు చూస్తున్నది. కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం, తాలు, తేమ పేరిట కొర్రీలను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెంటనే ధాన్యం కొనకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11: దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని, గన్నీ బ్యాగులు ఇస్తలేరని సర్కార్‌పై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీకి రైతులు తాళం వేసి, నిరసన తెలిపారు. సొసైటీ పరిధిలోని రాంపూర్‌లో నెల రోజులుగా కొనుగోళ్లు సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లారీల కొరత కారణంగా తూకం వేసిన బస్తాలు కూడా ఎక్కడికక్కడే ఉండిపోయాయని ఆవేదన చెందారు. సొసైటీ బాధ్యులు లారీల యజమానులతో కుమ్మక్కై మిగతా గ్రామాలకు లారీలు పంపిస్తూ, తమ గ్రామానికి పంపడం లేదని మండిపడ్డారు.

వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటా నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మార్కెట్‌కు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా కొమ్మలు పెట్టి, వాహనాల రాకపోకలను నిలిపివేసి రహదారిని దిగ్బంధించారు. మూడువారాలుగా మార్కెట్లో నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
‘తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోతే మమ్మల్ని రైతులను దోపిడీ చేస్తారా? ఇప్పటికే 42 కిలోలు జోకుతున్నం. ఇంకో కిలో ఎక్కువ జోకాలంటూ ఐకేపీ కేంద్రాల్లో మాపై ఒత్తిడి తెస్తున్నరు. ఇదేం తీరు. ఇట్లెట్ల జోకుమంటరు’ అంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల రైతులు మండిపడ్డారు. 30 మందికిపైగా రైతులు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్‌ను కలిసి తమ గోడువెళ్ల్లబోసుకున్నారు. 40 కిలోల తూకానికి అదనంగా 2 కిలోలు వేస్తున్నారని, శనివారం నుంచి ఇంకో కిలో ఎక్కువ జోకితేనే మిల్లర్లు దిగుమతి చేసుకుంటారని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ- గ్రేడ్ కింద కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని బీ- గ్రేడ్‌తో తరలిస్తున్నారని, గత 8 ఏండ్లుగా ఏ-గ్రేడ్‌తో చేసిన వారంతా, ఈ సారి మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నారని కలెక్టర్‌ను ప్రశ్నించారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి సత్వరమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు వ్యవసాయ మారెట్ ఎదుట మహబూబాబాద్-తొర్రూరు ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో బైఠాయించారు. ‘రావాలి.. రావాలి.. అత్తాకోడళ్లు.. రావాలి’ అంటూ రైతులు నినదించారు.
పోలీసులు వచ్చి రైతులను బుజ్జగించారు. ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవినీతి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని తానూర్-బెల్తరోడ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. తహసీల్దార్ మహేందర్నాథ్, ఎస్సై షేక్ జుబేర్, సొసైటీ సీఈవో సాయారెడ్డి రైతుల వద్దకు వచ్చి రెండు రోజుల్లో కొంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మక్కలు కొనుగోలు చేసి వారం రోజులైనా గోదాముకు తరలించడం లేదని రైతులు నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బాసర-భైంసా రహదారిపై ఆందోళనకు దిగారు. ముథోల్ మండలంలోని కారేగాం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మక్క సంచులను వెంటనే తరలించకపోవడంతో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో తడిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మక్కలు, వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ నిర్మల్ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. గన్నీ సంచులు అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయంలో పోడియం ఎదుట బైఠాయించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నది. ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోవడంతో అన్నదాతలు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకొని వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్లో మక్కలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు

వనపర్తి మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం.. తరలింపునకు నోచని ధాన్యం బస్తాలు

కొనుగోళ్ల జాప్యంతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో రోడ్డు వెంట దర్శనమిస్తున్న ధాన్యం రాశులు, కాంటా వేసిన ధాన్యం బస్తాలు

మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు రోడ్డెక్కారు. మహబూబాబాద్-తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి రైతులను బుజ్జగించి ధర్నా విరమింపజేశారు.

మక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో తానూర్-బెల్తరోడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. అధికారులు వచ్చి రెండ్రోజుల్లో మక్కలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

కాంటా బంద్ పెట్టడంతో వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై మక్క రైతులు రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిపి రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూడువారాలుగా మార్కెట్లో నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ధాన్యం తరలింపులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం పరిధిలోని గణేశ్‌పల్లి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు బైఠాయించారు. వెంటనే ధాన్యం తరలింపు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకుంటే రైతులను దోపిడీ చేస్తారా? అని కరీంనగర్ జిల్లా ఎలగందుల రైతులు వాపోయారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వద్ద గోడు వెల్లబోసుకున్న అనంతరం కలెక్టరేట్ వద్ద మాట్లాడుతున్న రైతులు

సరిపడా గన్నీ సంచులు అందించాలని ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ ఎదుట రైతులు, రైతు సంఘం నాయకులు బైఠాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీతో నిరసన విరమించారు.