మంచిర్యాల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా అధికార పార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేను ‘బైపాస్’ చేసిన ఓ నేత మంత్రి పంచన చేరారని, అనంతరం మంత్రి, ఎంపీ కోసం ఆయన పని చేస్తున్నారని.. త్వరలో పూర్తి స్థాయిలో మంత్రివర్గీయుడిగా మారిపోతారని వార్తలొస్తున్నాయి. కాగా, అసలు ఆ ఎమ్మెల్యేకు, సదరు బైపాస్ నేతకు పడటం లేదన్నది ఉత్తముచ్చటేనన్న వాదనలు సైతం తెరపైకి వచ్చాయి. మంచిర్యాలలో దుష్మనీ.. హైదరాబాద్‌లో దోస్తానీ.. వెనుక అసలు మర్మం వేరే ఉందంటూ ఇరువర్గాల సన్నిహితుల నుంచి లీకులు వస్తున్నాయి. మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి వార్తలొచ్చే దాకా అంతా బాగుండి.. ఒక్కసారిగా ఇద్దరి మధ్య అంతరం పెరగడం.. అసలు మనకు వ్యతిరేకులు ఎవరు, శత్రువులు ఎవరు.. అని గుర్తించడానికే జరుగుతుందనే కొత్తకోణం సైతం మంచిర్యాల రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇది ఊరికే నోటి మాటగా చెప్పడం లేదు.. బైపాస్ నేత మంత్రి పంచన చేరడం.. ఎమ్మెల్యేకు ఇచ్చిన డబ్బులు వెనక్కి అడగడటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మరి అదే నిజమైతే హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బైపాస్ నేత ఉంటున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఎమ్మెల్యేకు ఆ ప్లాట్ అలాటైనప్పటి నుంచి ఆయనే ఉంటున్నట్లు తెలిసింది. ఇదొకటైతే కొన్ని రోజుల క్రితం.. నస్పూర్‌లోని ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంటిపై దాడి జరిగింది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మంచిర్యాల కార్పొరేషన్లో కీలక పదవి దక్కించుకున్న నేత కోసం ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. కాగా, ఈ దాడిలో బైపాస్ నేత ప్రధాన అనుచరులు పాల్గొన్నారు. ఎఫ్ఐఆర్లోనూ ప్రధాన నిందితులుగా వారి పేర్లున్నాయి.. ఈ ఉదాహరణలు చాలదా ఈ ఇద్దరూ ఒక్కటే అని చెప్పడానికి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అవును.. వాళ్లిద్దరూ ఒక్కటే అంటూ జరుగుతున్న ప్రచారంతో ఈ దుష్మనీని నమ్మలా.. వద్దా అన్న డైలమా క్షేత్రస్థాయిలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా అధికారిక హస్తంపార్టీ నేతల్లో గుబులు మొదలైనట్లు తెలిసింది. ఇద్దరి మధ్య గొడవలని తెలియగానే కొందరు నేతలు బైపాస్ లీడర్‌కు నేరుగా టచ్‌లోకి వెళ్లారు. మరికొందరు నేరుగా కాకపోయిన ఇంటర్నల్‌గా టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న కొందరు బైపాస్ నాయకుడిని నమ్ముకొని భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అలాంటి వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎవరు ఏం మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యతిరేకులు ఎవరు.. ఆ ఇద్దరు కలవాలని కోరుకున్నది ఎవరు.. ఎవరి మనసులో ఏం ఉంది..
అన్నది.. ఈ పరిణామంతో పూర్తిస్థాయిలో బయటపడింది. ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో కలుసుకొని, ఈ వివరాలు షేర్ చేసుకుంటున్నారన్న సందేహాలు సైతం వస్తున్నాయి. ప్రచారం జరుగుతున్నట్లు ఆ ఇద్దరూ ఒక్కటే అయితే.. మా పరిస్థితి ఏమిటనే టెన్షన్ పరిధి దాటి ప్రవర్తించిన నేతల్లో మొదలైనట్లు సమాచారం. దీంతో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని.. అంటీముట్టనట్లుగా ఉండి.. క్లారిటీ వచ్చాకే ఎవరి పక్షమనేది నిర్ణయించుకుంటేనే మంచిదన్న డైలమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు బైపాస్ నేత ఈ నెల 16వ తేదీన మంత్రి వివేక్ సమక్షంలో బలప్రదర్శన చేయనున్నారన్న వార్తలు సైతం వస్తున్నాయి. శ్రావణమాసం మొదలవగానే ఈ కార్యక్రమం ఉండాలన్న ఉద్దేశంతో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్కో డివిజన్ నుంచి 30 మందితో పాటు దాదాపు 23 మంది కార్పొరేటర్లతో మంత్రివర్గంలోకి బైపాస్ నేత చేరుతారని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పటికే బయటికి పొక్కిన నేపథ్యంలో ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారని, ఇప్పటికే ఆ 23 మందిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారని తెలిసింది. 16న ముహూర్తం ఫిక్సైనా నేపథ్యంలో అదే రోజున ఎమ్మెల్యే కార్పొరేటర్లతో స్థానికంగా ఆయన ఇంట్లో లేదా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తారని, లేకపోతే అందరినీ విహారయాత్రకు పంపిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కార్పొరేటర్ల విషయం అటు ఉంచితే డివిజన్‌కు 30 మందితో బైపాస్ నాయకుడి బలనిరూపణ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎప్పటి నుంచో మంచిర్యాల నియోజకవర్గంపై పట్టుకోసం ఎదురుచూస్తున్న మంత్రి, ఎంపీ వర్గం.. బైపాస్ లీడర్‌ను కేంద్రంగా చేసుకొని రానున్న రోజుల్లో తమ వర్గాన్ని నియోజకవర్గంలో పెంచుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఏదైమైనా ఈ నెల 16న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక ఘట్టానికి వేదికయ్యే అవకాశాలున్నాయి.
కాకపోతే జరుగుతున్న ప్రచారం మేరకు ఆ ఇద్దరూ ఒక్కటన్నది నిజమైతే.. మంత్రివర్గంలో చేరినా సదరు నేత ఎమ్మెల్యేకు పనిచేస్తారని, ఎన్నికల నాటికి అంతా ఒక్కటై పని చేస్తారని, దీని వెనుక అసలు వ్యూహం ఇదేనన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇది ఎటుపోయి ఎటువస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. కాగా, మంచిర్యాల ‘హస్తం’ పార్టీ రాజకీయాలను కుదిపేస్తున్న జగన్నాటకం ఇలా అనేక మలుపులు తిరుగుతుండటం ఆసక్తిగా మారింది.