సుబేదారి, ఆగస్టు 6 : ఎట్టకేలకు వరంగల్ పోలీసు కమిషనరేట్ పీఆర్వో ఎం మోహనకృష్ణపై బదిలీ వేటు పడింది. ఆయన గత 18 ఏళ్లుగా కదలకుండా ఒకే పోస్టులో కొనసాగుతున్నాడు. ఏడాదిన్నర క్రితం హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతిపై హనుమకొండ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పోస్టింగ్ పొంది, అక్కడ డ్యూటీ చేసినట్లు అలవెన్స్ తీసుకుంటూనే డిప్యుటేషన్‌పై పోలీసు కమిషనరేట్ పీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో స్పందించిన సీపీ శ్వేత కమిషనరేట్ నిఘా వర్గాలను విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు వారిచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం పీఆర్వో మోహనకృష్ణ డిప్యుటేషన్ రద్దు చేసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు బదిలీ చేశారు. ఆయనతోపాటు నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లో ఉండి, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మరో 14 మంది డిప్యుటేషన్లు సైతం రద్దు చేయడమే కాకుండా పాత ట్రాఫిక్ విధుల నుంచి తప్పించి, కొందరిని లా అండ్ ఆర్డర్, మరికొందరిని టాస్క్‌ఫోర్స్, సీసీఆర్బీ, సైబర్‌క్రైం విభాగాలకు బదిలీ చేశారు. వీరిలో ఇద్దరు మహిళా ఏఎస్సైలు ఎన్ భారతి, బీ శ్రీలత, హెడ్‌కానిస్టేబుళ్లు టీ దామోదర్, భూక్యా శ్రీనివాస్, బానోత్ సారంగం, జీ పున్నంచందర్, ఎస్డీ గాలిబ్, జీ అర్జున్, ఈ సారయ్యతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లున్నారు.
డిప్యుటేషన్ల రద్దుపై హర్షం..
వరంగల్ సీపీ పలువురి డిప్యుటేషన్లు రద్దు చేయడంపై కమిషనరేట్ పరిధిలోని సాధారణ పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్ పొంది, రోడ్లపై డ్యూటీ చేయకుండానే 30 శాతం అలవెన్స్ తీసుకుంటూ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న 15 మందిని బదిలీ చేయడాన్ని వారు స్వాగతించారు.