పినపాక, ఆగస్టు 6 : కాంగ్రెస్ సర్కార్ స్నేహ ధర్మానికి తూట్లు పొడుస్తున్నదని, తమ సహకారంతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం నుంచి సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్రను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రెండున్నరేండ్ల రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
రేవంత్ సర్కార్ తన గొయ్యిని తానే తవ్వుకుంటూ శవపేటికను కూడా తయారు చేసుకుంటున్నదని విమర్శించారు. పొత్తులో భాగంగా పినపాక స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలేశామని, కాంగ్రెస్ ఇలా మొండిగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పినపాకలో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. బీజేపీ రూపంలో దేశంలో దొంగల రాజ్యం సాగుతున్నదని, ఆ దొంగల నుంచి దేశాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు మార్పు అనివార్యమని చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాచైతన్య యాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.