వనపర్తి టౌన్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్పై కాంగ్రెస్ కార్యకర్త రమేశ్ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను, బీఆర్ఎస్ నాయకులను నిలువరించారు. అనంతరం వారు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ విజయ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ప్రశ్నించే నాయకులను టార్గెట్ చేస్తూ సదరు కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కవ్వింపు చర్యలకు దిగుతున్న పెయిడ్ ఆర్టిస్ట్‌లను ఎమ్మెల్యే పెంచి పోషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గతంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్వయంగా నాయకులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఎస్పీ సూచనల మేరకు సామరస్యాన్ని పాటిస్తున్నామని చెప్పారు. ఎస్పీపై గౌరవంతో బీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉంటే కాంగ్రెస్ వారు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. పోలీసుల చర్యలు కూడా అధికార పార్టీకి వత్తాసు పలికేలా ఉన్నాయని ఆరోపించారు.