ఉప్పల్, జూన్ 7: రాష్ట్రంలో నిరసనల పర్వం తగ్గడం లేదు. ఆదివారం ఏకంగా సీఎం రేవంత్‌కే నిరసన సెగ తగిలింది. ఉప్పల్‌భగాయత్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని తమ భూములను 80% నిషేధిత జాబితాలో పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకటి, రెండు ప్లాట్లలో ఉన్న సమస్యను మొత్తం సర్వే నంబర్‌కు వర్తింపజేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంలో పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం: సీఎం
హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో రూ.1511 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టామనీ, ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడ్తామని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ డిగ్రీ కళాశాల ఓ పాఠశాలలో కొనసాగుతున్నదని దానికి స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. మంత్రులు శ్రీధర్‌బాబు, రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేశ్ పాల్గొన్నారు.