ఖైరతాబాద్, అక్టోబర్ 20 : దేశం ఏ ఎన్నికలు జరిగినా జనాభాకు అనుగుణంగా బీసీలకు సీట్లు దక్కాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే ప్రధానమని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సమగ్ర కులగణన చేస్తామని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని, ఇకనైనా వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థలకే కాకుండా ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం బీసీలకు వర్తించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు బీసీ అయినందుకే ఆయనకు సరైన రాజకీయ ప్రాధాన్యం లభించలేదని, ఆయన అగ్రకులంలో పుట్టి ఉంటే ఎప్పుడో ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యేవారని తెలిపారు. బీసీల హక్కుల కోసం పోరాడేవారికి బీఆర్ఎస్ బాసటగా నిలుస్తుందని స్పష్టంచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కులగణన దేశవ్యాప్తంగా జరుగాలని, ప్రధాని మోదీ నిజమైన బీసీ అయితే వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శాసనమండలి ఉప చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.