హైదరాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రె స్లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆ వర్గం నేతలు అధిష్ఠానంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. తమకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలకే టికెట్లు ఇస్తున్నారని, ఈసారైనా న్యాయం చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని బీసీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది.
కమిటీలోనే చొటివ్వలేదు
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. కేరళ ఎంపీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో సభ్యులుగా గుజరాత్‌కు చెందిన జిగ్నేష్, సిద్ధిఖీ, ఎక్స్అఫిషియో సభ్యులుగా రేవంత్, మల్లు, ఠాక్రే, ఉత్తమ్‌కు చోటు కల్పించారు. కమిటీలో ఒక్క బీసీ నేత కూడా లేరని ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కమిటీలోనే బీసీలకు చోటివ్వకపోతే ఇక టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
దరఖాస్తుల డ్రామా ఎందుకు?
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రె స్ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. గతంలో ఇదేవిధంగా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, చివరకు దరఖాస్తు చేసుకోనివారికి కూడా టికెట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. అంతర్గతంగా జరిగే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దరఖాస్తుల డ్రామా ఎందుకని ప్రశ్నిస్తున్నారు.