హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ) : ఎన్నికల ముందర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్సీలు కవిత, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, దేశ్‌పతి శ్రీనివాస్, తాతా మధు, నవీన్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎల్ రమణ తదితరులతో కలిసి మండలి మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల భృతి ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఆటోనగర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలిందిపోయి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించడం శోచనీయమని పేర్కొన్నారు. ఆటో కార్మికులు అధైర్యపడొద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యేదాకా అసెంబ్లీలో పోరాడతామని మధుసూదనాచారి భరోసా ఇచ్చారు.
అధికారంలోకి రాగానే పేదలకు ఏడాదికి ఆరు సిలిండర్లను రూ.500 చొప్పున అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆచరణలో విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. 95 లక్షల మంది దరఖాస్తు చేసుకొంటే కేవలం 42 లక్షల మందికే, అది కూడా రెండు, మూడు సిలిండర్లకే వర్తింపజేయడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మండలిలో మంత్రిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నిస్తే సరైనా సమాధానం చెప్పకుండా పారిపోయారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాఠశాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మీభవానికి మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఎమ్మెల్సీ తాతా మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరోగ్య నిబంధలకు విరుద్ధంగా ఆమెకు ఏడుసార్లు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎక్కించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి అధ్యానంగా తయారైందని, ఏడాది పాలనలో 48 విద్యార్థులు మరణించడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ఆదుకోవాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఏడాదైనా అతీగతీలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలను రూ.18 వేలకు పెంచాలని, 30 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో 12.50 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా గతంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును పూర్తిచేయలేకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు చెందిన ప్రాజెక్టుపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థంకావడంలేదని పేర్కొన్నారు.