Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కుత్బుల్లాపూర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం… బిల్డర్లకు స్వర్గధామం. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వళ్లిన చాలా మంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఏడాది కాలంలో రియల్ రంగంలోని స్తబ్ధత బిల్డర్లకు ఊపిరి సలపనీయడం లేదు. ఒకవైపు నిర్మించిన ఆకాశహర్మ్యాలు బోసిపోయి కనిపిస్తుంటే… మరోవైపు తెచ్చిన అప్పులు, గుండె మీద కుంపటిగా మారాయి. చివరకు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బలవన్మరణాలు మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో నివాసముంటున్న ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి (39) అనే బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరిసిల్ల జిల్లాలోని గోపాలపురం గ్రామానికి చెందిన ముత్యాల ఏసురెడ్డి అల్వాల్‌లో స్థిరపడ్డారు. చాలా ఏండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన ఏకైక కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి ఎనిమిదేండ్లుగా అదే రంగంలోకి పనిచేస్తున్నాడు. మిత్రులతో కలిసి కొంపల్లిలో అపార్టుమెంట్ నిర్మాణం చేపట్టి, విజయవంతంగా అమ్మకాలు పూర్తిచేశారు. వేణుగోపాల్‌రెడ్డి భార్య ప్రణయ, కూతురు ఆద్యతో కలిసి ఆ అపార్టుమెంట్లోనే సొంత ఫ్లాటులో ఉంటున్నారు. అల్వాల్‌లోనూ మిత్రులతో కలిసి వేణుగోపాల్‌రెడ్డి నిర్మాణా లు చేపట్టారు. ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి తన కూతురు ఆద్య పేరిట ఒక నిర్మాణ ప్రా జెక్టు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రెండేం డ్ల క్రితం గుండ్లపోచంపల్లిలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదంతస్తుల అపార్టుమెం టు నిర్మాణం మొదలుపెట్టారు. ఇందుకు పలు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. ప్రస్తుతం అపార్టుమెంట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ అపార్టుమెంట్లో పది ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరడంతో పాటు ఆర్థికంగా లాభపడతానని ఆశించారు. కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి.
కొన్నిరోజులుగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనడంతో ఫ్లాట్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయిందని వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజులుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగిందని చెప్పారు. బుధవారం సాయంత్రం తన అపార్టుమెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్‌రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేణుగోపాల్‌రెడ్డి సూసైడ్ నోట్ కూడా రాశారని, అందులో తాను చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారని కుటుంబ సభ్యులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు పేట్‌బషీర్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.