హైదరాబాద్, ఆగస్టు28 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఇటీవల చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అనేక తప్పులు దొర్లాయని, ఫలితంగా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వాటిని సవరించాలని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏటీజీఆర్ఈఐఈడబ్ల్యూఏ) డిమాండ్ చేసింది. డిస్లొకేట్, 317 జీవో బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు, పలువురు మంత్రులకు, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అసోసియేషన్ అధ్యక్షుడు కూకుట్ల యాదయ్య, జనరల్ సెక్రటరీ పాపిరెడ్డి, ట్రెజరర్ బసవయ్య బుధవారం వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారులకు సమస్యలు విన్నవించారు. అన్ని సొసైటీల్లో జీవో 80 ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ను నిర్వహిస్తే, అందుకు విరుద్ధంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టిందని, ఫలితంగా గందరగోళం నెలకొన్నదని తెలిపారు.
కామన్ సీనియార్టీ జాబితా వల్ల అనేక మంది టీచర్లు డిస్లొకేట్ అయ్యారని, సబ్ కమిటీ నివేదిక రాకముందే 317 జీవో ద్వారా ఉద్యోగులను రిలీవ్ చేశారని వాపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులకు ప్రమోషన్లు కల్పించారని తెలిపారు. మొత్తంగా బదిలీలు, పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని, నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.