హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో తమ వాణి వినిపిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతన్నలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం నేతలు.. ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావును శుక్రవారం ప్రత్యేకంగా కలిశారు. చేనేతపై జీరో జీఎస్టీ చేయాలనే డిమాండ్‌ను పార్లమెంటులో వినిపించాలని విజ్ఞప్తిచేశారు. జీఎస్టీ వల్ల చేనేత ఉత్పత్తులపై పడుతున్న ప్రభావాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై ఎంపీలు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి ఈ అంశాన్ని వివరిస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీలను కలిసినవారిలో అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్, చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు భిక్షపతి తదితరులు ఉన్నారు.