నిర్మల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. శనివారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దాదాపు గంటపాటు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ.. సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతులకు సంబంధించి ఒక్క రుణమాఫీ మాత్రమే ఉన్నదని, దానిని ఏకకాలంలో మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్రభుత్వంలో అనధికార కరెంటు కోతలు మొదలయ్యాయని, కోతలు లేని నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని, పంటల బీమా పథకాన్ని అమలు చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, రైతులు పాల్గొన్నారు.