బంజారాహిల్స్, డిసెంబర్ 10: రాష్ట్రంలోని 14.75 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలను ముట్టడించిం ది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో మొహరించిన పోలీసులు వారిని అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. పోలీసులు, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రుల క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసు లు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఒకవైపు విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డా రు. కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు మంజూ రు చేస్తున్న ప్రభుత్వం.. పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వెంటనే 4వేల కోట్ల పెండింగ్ నిధులు మంజూరు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు కోడ విజయ్‌కుమార్, నీలం వెంకటేశ్, చంద్రశేఖర్, నర్సింహ, విజయ్, అరవింద్, శివ, స్వామి, మనీశ్, రవి, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం నిరసన
పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు యువజన సంఘం ఆధ్వర్యంలో ‘చలో కలెక్టరేట్’ నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. కాగా బోధనా రుసుము, ఉపకార వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యార్థులు భిక్షాటన చేపట్టారు.