షాద్‌నగర్, నవంబర్ 2 : షాద్‌నగర్‌లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై దాడిచేశారు. దీంతో పోలీసులు కూడా రెచ్చిపోయారు. విద్యార్థులపై దాడిచేసి చెదరగొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతకూ ఏం జరిగిందంటే? ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తున్నారని, డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలోని సాంఘిక సంక్షేమ మహిళా, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆదివారం ఉదయం షాద్‌నగర్ బైపాస్ రోడ్డు, పట్టణ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు.
ఏడాదికాలంగా తమనువేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గురుకులాల నిర్వహణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని పేర్కొన్నారు. కాస్మొటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిగితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులతో తనకు పరిచయాలు ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. విద్యార్థినుల ఆందోళనకు టీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలుపడంతో షాద్‌నగర్ చౌరస్తా ఉద్రిక్తంగా మా రింది. దాదాపు రెండుగంటలపాటు ఆందోళన కొనసాగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వి ద్యార్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై దాడితో పోలీసులు చెలరేగిపోయారు. విద్యార్థులను చెదరగొట్టి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. విద్యార్థినుల ఆందోళనను తెలుసుకున్న గురుకుల విద్యాసంస్థల జోనల్ అధికారి నిర్మల, ఫరూఖ్‌నగర్ ఎంఈవో మనోహర్ అక్కడికి చేరుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. దీంతో వారిని ప్రత్యేక బస్సుల్లో పాఠశాలకు తరలించారు.