ఖమ్మం కమాన్‌బజార్, ఏప్రిల్ 8 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తున్న తమ పార్టీ నేతలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పెట్టిన దేశ ద్రోహం తదితర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఎం(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు కేజీ రామచంద్రన్, కే రమ, కే రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం వారు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోపాటు వేధింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా, ఉమర్ ఖలీద్, హరగోపాల్, విమలక్క తదితరులపై కూడా తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం, దేశ ద్రోహం కేసులను పెట్టారని వివరించారు. పోటు రంగారావు 50 ఏళ్ల నుంచి విప్లవోద్యమంలో పని చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ప్రభుత్వం బనాయించిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.