హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతున్నది. విగ్రహ ఏర్పాటుపై అధిష్ఠానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమానికి గాంధీ కుటుంబం నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడానికి ఈ ఆగ్రహమే కారణమని తెలిసింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. కానీ, వారు మాత్రం రావడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర పెద్దలను అధిష్ఠానం తలంటినట్టు తెలిసింది. ‘వివాదాల మధ్య రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది రాజీవ్‌గాంధీకి గౌరవం పెంచుతుందా? తెలంగాణతల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటుచేశారు? తద్వారా తెలంగాణ ప్రజల్లో రాజీవ్‌గాంధీని విలన్‌ను చేయాలని అనుకున్నారా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణతల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పుడు రాజీవ్‌గాంధీ గౌరవం ఏం కావాలని గట్టిగానే తలంటినట్టు తెలిసింది. మాజీ ప్రధాని అయిన రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయంలో అందరి ఆమోదంతో చేయాలనే కనీస ఆలోచన కూడా లేదా? అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. అయితే దీనిపై రాష్ట్ర నేతలు వివరణ ఇచ్చిననట్టు తెలిసింది.
తెలంగాణతల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేయబోతున్నామని, అందుకే బయట తెలంగాణతల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్టు వివరించినట్టు తెలిసింది. ఈ వివరణపై అధిష్ఠానం పెద్దలు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. అలాంటప్పుడు ముందుగా తెలంగాణతల్లి విగ్రహం ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిందని, అప్పుడు ఈ వివాదం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పేరున్న నేతలను గౌరవం పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, ఉన్న గౌరవాన్ని తగ్గించే పనులు మాత్రం చేయొద్దని గట్టిగానే చెప్పినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అధిష్ఠానంతోపాటు రాష్ట్ర సీనియర్ నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.