Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరును చూస్తే ఈ అనుమానాలే తలెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిైళ్లె ఏకంగా 36 సార్లు విచారణను ఎదుర్కోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నది.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీజేపీకి అనుకూలమైన విధానాన్ని అవలంబిస్తున్నది. నిందితుల వద్ద లేని సమాచారాన్ని ఉన్నట్టుగా చెప్పించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిైళ్లెని ఏకంగా 36 సార్లు విచారించడం ఇందుకు నిదర్శనం. ఇందులో ఈడీ 29 సార్లు, సీబీఐ 7 సార్లు ఆయనను ప్రశ్నించాయి. నిరుడు సెప్టెంబర్ 18న తొలిసారి పిైళ్లె స్టేట్మెంట్ను రికార్డు చేసిన ఈడీ.. ఇప్పటివరకు పలు దఫాల్లో 11 సార్లు అతని స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అయినా బీజేపీకి అనుకూలమైన సమాధానం లభించకపోవడంతో పిైళ్లె కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి పిైళ్లె తన వద్ద ఉన్న సమాచారాన్నంతా ఇప్పటికే దర్యాప్తు సంస్థల ఎదుట ఉంచినట్టు ఆయన తరఫు న్యాయవాది చెప్తున్నారు. ఇతర నిందితులతో కలిపి పిైళ్లెని విచారించేటప్పుడు ఆయన తరఫు న్యాయవాది కూడా వెంట ఉండాలని కోరినా ఈడీ ససేమిరా అంటున్నది. పిైళ్లె వద్ద లేని సమాచారాన్ని ఉన్నట్టుగా ఈడీ విచారణలో చెప్పించి, ఆ వివరాల ఆధారంగా కొందరు రాజకీయ నాయకుల పేర్లను ఈ కేసులో చేర్చారన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
ఈ క్రమంలోనే పిైళ్లెతో అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును చెప్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విచారణలో తాను ఇచ్చిన తొలి స్టేట్మెంట్ తప్పని, ఎమ్మెల్సీ కవితకు తాను బినామీ కాదని, ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఆమె ప్రమేయం లేదని పిైళ్లె తాజాగా కోర్టుకు విన్నవించడంతో ఈడీ తీరుపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయినా విచారణలు, స్టేట్మెంట్లు అంటూ ఈడీ అధికారులు నానా యాగీ చేస్తుండటం గమనార్హం.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఎక్కడా డాక్యుమెంట్ రూపంలో లేదు. కేవలం ఆ కేసులో నిందితులు చెప్పిన మాటల ఆధారంగానే కవితను ఈడీ విచారణకు పిలుస్తున్నది. ఈ నెల 11న తొలిసారి ఏకంగా 9 గంటలపాటు ఆమెను ప్రశ్నించిన ఈడీ.. మళ్లీ ఈ నెల 16న విచారణ కోసం ఢిల్లీకి రమ్మంటున్నది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రామచంద్ర పిైళ్లె పేరును ప్రస్తావిస్తున్న ఈడీ.. అతనితోనే రాజకీయ నాయకులు పేర్లను చెప్పించే ప్రయత్నం చేస్తున్నది.
రాజకీయ అస్త్రంగా కావల్సిన ‘బలమైన వ్యక్తి (కవిత)’ పేరును రామచంద్ర పిైళ్లెతోనే చెప్పించి.. మళ్లీ అదే బలమైన వ్యక్తి పేరును సాకుగా చూపి ‘పిైళ్లె స్టేట్మెంట్ మార్చుకున్నాడు’ అంటూ ఈడీ వాదిస్తున్నది. మొత్తానికి బీజేపీకి రాజకీయంగా అనుకూలించే అంశాలను నిందితులతో చెప్పించడం ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలన్న కుతంత్రంతోనే కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలను ఉపయోగిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు.