న్యూఢిల్లీ, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మూడు ప్రధాన కారణాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఈడీ, సీబీఐ విచారణ తీరును ధర్మాసనం తప్పుబట్టింది. కుంభకోణం జరిగిందనడానికి సరైన ఆధారాలను ఇప్పటివరకూ సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్రయల్ పూర్తైన తర్వాత కూడా మహిళ అని చూడకుండా కవితను జైల్లో ఉంచడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది.
1. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేసింది. తదుపరి ఎలాంటి విచారణకు అవకాశంలేదు.
2. ఈ కేసులో దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కింది కోర్టుకు (రౌస్ అవెన్యూ కోర్టు) చేరింది. కేసు ట్రయల్ ప్రారంభం అయ్యాక నిందితులు జైల్లో కొనసాగాల్సిన అవసరం లేదు.
3. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్-45(1) ప్రకారం.. మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.
కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసు పెద్ద స్కామ్ అంటూ ఈడీ, సీబీఐ తరుఫు న్యాయవాది వాదించారు. దీంతో జోక్యం చేసుకొన్న ధర్మాసనం.. ‘ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు. నెలలపాటు విచారణ జరిగిందంటున్నారు. 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను విచారించామని చెప్తున్నారు. 50 వేల పేజీల కొద్దీ సాక్ష్యాలు సేకరించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. మీరన్నట్టు.. ఇంత పెద్ద స్కామ్ జరిగితే, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకపోవడమేంటి? అసలు స్కామ్ జరిగినట్టు రుజువులేమిటి?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ఇప్పటికే, విచారణ పూర్తయింది. దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు దాఖలు చేశాయి.
పిటిషనర్ అయిన మహిళ ఐదు నెలలుగా విచారణ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. పూర్తి కేసు తేలేందుకు చాలా సమయం పడుతుంది. విచారణ భవిష్యత్‌లో ముగిసే అవకాశం కనిపించడంలేదు. అండర్ ట్రయల్ కస్టడీ (విచారణ ఖైదీ) పేరిట నిందితులను జైల్లో కొనసాగించడం శిక్షే అవుతుంది. అందుకే పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు చెప్తున్న స్కామ్‌లో పిటిషనర్ ఎక్కడ భాగమయ్యారో అర్థంకావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం.. దానికి ఒక్క ఆధారమైనా చూపించాలిగా? అని ఈడీని, సీబీఐని ప్రశ్నించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్-45 ప్రకారం మహిళలకు ప్రత్యేకమైన వెసులుబాటు ఉన్నదని, సెక్షన్-45(1) ప్రకారం మహిళను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకునేందుకు అర్హత ఉన్నదని ధర్మాసనం గుర్తుచేసింది. విద్యావంతురాలై, ఉన్నత హోదా కలిగిన మహిళ నిందితురాలిగా ఉంటే బెయిల్ పొందేందుకు అర్హులు కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఒకవేళ, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు గనుక చట్టరూపం దాల్చితే విద్యావంతురాలైన మహిళ ఏదైనా కేసులో నిందితురాలిగా ఉంటే, ఆమెకు ఎన్నటికీ బెయిల్ లభించదని కోర్టు తెలిపింది.
ఇది ఎంతమాత్రం సబబు కాదని వెల్లడించింది. బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఎంపీ, ఎమ్మెల్సీ హోదాలో ఉన్న మహిళను ఒకలా.. సాధారణ మహిళను మరోలా చూడటం వివక్ష కిందకే వస్తుందని పేర్కొన్నది. ఈవిధమైన విభేదాలు చూపకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్ కవితకు సెక్షన్-46 నిబంధన ప్రయోజనాలను నిరాకరించాలన్న హైకోర్టు వాదనలోనూ వైరుధ్యం ఉన్నదని పేర్కొన్నది.
కవిత బాగా చదువుకున్న మహిళ అని, ఆమె సామాజిక సేవ ద్వారా గణనీయమైన కృషి చేస్తున్నారని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనిని బట్టి పిటిషనర్ వల్ల ఈ కేసులో ఎవరికీ హాని కలగబోదని స్పష్టమవుతున్నదని పేర్కొన్నది. సెక్షన్-45 (1) నిబంధనల ప్రకారం మహిళలకు లభించే ప్రయోజనాలు.. పిటిషనర్ కవితకు కూడా వర్తిస్తాయని చెప్పింది. సెక్షన్-45 కింద ఉపశమనాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కవిత సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్‌ను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దన్న హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది.
కవిత ఉన్నత విద్యావంతురాలని, సామాజిక సేవ చేస్తున్నారంటూ విజయాలను నమోదు చేసిన హైకోర్టు, కవిత బెయిల్ మంజూరు విషయంలో ఆ దృష్టిలో చూడలేదని ఆక్షేపించింది. పిటిషనర్ కవితపై ఆరోపణలతో జైల్లో విచారణ కొనసాగించి దుర్భలమైన పరిస్థితి ఏర్పర్చకూడదని వ్యాఖ్యానించింది. పీఎంఎల్ఏ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళల పట్ల కోర్టులు మరింత సున్నితంగా వ్యవహరించాలని హితవు చెప్పింది. కోర్టులు మహిళల పట్ల మరింత సున్నితంగా, సానుభూతితో వ్యవహరించాలని సూచించింది. అన్ని అంశాలను లోతుగా పరిశీలన చేశాక కవిత అప్పీల్ పిటిషన్‌ను అనుమతిస్తూ ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది.
కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం కంటే ముందు ఇరుపక్షాల మధ్య వాడి-వేడి వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐ తరుఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ.. కవిత తన ఫోన్‌ను ఫార్మాట్ చేయడం ద్వారా సాక్ష్యాలను ధ్వంసం చేసినందున బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. బెయిల్ మంజూరుకు మహిళలకు ఉన్న చట్టపరమైన వెసులుబాటును కవితకు వర్తింపజేయొద్దని కోరారు. కవిత సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.
కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, ఈరోజుల్లో రెండు మూడు వారాలకు ఒక ఫోన్ మార్చేస్తున్నారని, కవిత కూడా తన ఫోన్లను మార్పు చేసినప్పుడు తన వద్ద పనిచేసే వారికి ఇచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే ఫోన్‌ను ఫార్మాట్ చేశారని వివరించారు. ఐఫోన్‌ను తన వద్ద పనిచేసే వాళ్లకు ఇచ్చేస్తారా? అని ఎస్వీ రాజు ప్రశ్నించగా, ఐఫోన్ అయితే ఇవ్వకూడదా? ఐఫోన్ అయితే ఏంటని? రోహత్గీ ఎదురు ప్రశ్నించారు.
వాదనల తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని, మహిళగా ఆమెకు ఉన్న ప్రత్యేక హక్కుల ప్రకారం చూసినా బెయిల్‌కు ఆమె అర్హురాలేనని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని పూర్తిగా చట్టపరమైన కోణం నుంచి చూడాలని దర్యాప్తు సంస్థలకు చెప్పింది. కవితను మద్యం కేసులో కొనసాగించేందుకు మీ దగ్గర ఉన్న రుజువులు ఏమిటని ఈడీ, సీబీఐని మరోసారి ప్రశ్నించింది.
అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కలుగజేసుకొన్న న్యాయస్థానం.. ‘కేసు పూర్వాపరాలను విశ్లేషిస్తే, సీబీఐ, ఈడీ దర్యాప్తుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇష్టారీతిన నిందితులను ఎన్నుకొని, విచారించి.. ఆ తర్వాత వాళ్లు అప్రూవర్లుగా మారినట్టు చెప్పి.. వాళ్లు చెప్పిన విషయాలను బట్టి చార్జీషీట్లు దాఖలు చేయడమేంటి? నిజంగా విచారణ పారదర్శకంగా జరిగిందా?’ అని అనుమానాలు వ్యక్తం చేసింది.
‘పిటిషనర్ ఈ స్కామ్‌లో భాగమైనట్టు ఒక్క ఆధారమైనా చూపించండి. అభియోగాలు మోపుతూ, విచారణ పేరిట పిటిషనర్‌ను ఇంకెన్నాళ్లు జైల్లో ఉంచుతారని’ నిలదీసింది. ఈ క్రమంలో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరుఫు న్యాయవాది వాదిస్తుండగా.. ‘ఇంతకంటే మీరు ఒక్క పాయింట్ ఎక్కువ వాదించినా.. మీరు కావాలనే బెయిల్‌ను అడ్డుకొంటున్నట్టు జడ్జిమెంట్‌లో మేము రాయాల్సి వస్తుంది’ అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కాగా, ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఈడీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. ఆ తర్వాత గత ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను కస్టడీలోకి తీసుకున్నది. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు మే 6న తిరస్కరించింది. దీనిపై హైకోర్టులో సవాల్ చేస్తే గత జులై 1న ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పలు దఫాల విచారణ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ సమయంలో సుప్రీంకోర్టు కల్పించుకుని, పిటిషనర్ (కవిత)పై కేసు నమోదు చేసేందుకు ఫోన్ ఫార్మాట్ చేయడమనే అంశం ప్రాథమికంగా సాక్ష్యం కాబోదని, అసలు అది ఏ మాత్రం సరిపోదని చెప్పింది. దీనిపై ఎస్వీ రాజు జోక్యం చేసుకుని.. కవిత తన ఫోన్లల్లోని అనేక మెసేజ్‌లను, వాట్సాప్ చాటింగ్‌లను పూర్తిగా తొలగించేశారని, ఫోన్లను ఫార్మాట్ కూడా చేసి ఆధారాలు లేకుండా చేశారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ కల్పించుకుని తాను కూడా అనేక మెసేజ్‌లను ఫోన్నుంచి తరుచూ తొలగించేస్తూ ఉంటానని, అవసరం లేనివి, ఏండ్ల తరబడి అలాగే ఉన్నవి, గ్రూప్‌ల్లోని మెసేజ్‌లను తొలగించేస్తుంటానని చెప్పారు. మెసేజ్‌లు తొలగించడమే నేరమా? అని ప్రశ్నించారు. ఒకవేళ, అదే నిజమైతే, మేము (న్యాయమూర్తులం) నేరం చేసినట్టేనా? అని ఎస్వీ రాజును సూటిగా ప్రశ్నించారు.
ఫోన్ అనేది చాలా ప్రైవేట్ విషయమని, అందులో ఇతరత్రా విషయాలు కూడా ఉంటాయని, సాధారణంగా మెసేజ్‌లను తొలగించేయడం అందరూ చేస్తూనే ఉంటారని, వందల మెసేజ్‌లు పెట్టుకుని ఎవరూ గందరగోళానికి గురికావాలని కోరుకోరని జస్టిస్ విశ్వనాథన్ చెప్పారు. మెసేజ్‌లు తొలగింపు మినహా ఇతర విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలని, ఇదే కేసుకు ప్రధానం కాదని, ఇతర ఆధారాలు ఉంటే చెప్పాలని కోరారు.
కవిత ఫోన్ ట్యాపరింగ్ చేశారని ఎస్వీ రాజు చెప్పగానే జస్టిస్ విశ్వనాథన్ కల్పించుకుని ఫోన్ ఫార్మాట్‌కు, ఫోన్ ట్యాంపరింగ్‌కు చాలా తేడా ఉన్నదని చెప్పారు. మరో న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కల్పించుకుని, చాలా మంది వద్ద రెండు, మూడు ఫోన్లు ఉంటాయని, ఒకే ఫోన్ పెట్టుకుని అన్ని కాల్స్‌ను ఆన్సర్ చేసే గందరగోళ పరిస్థితులను ఎవరూ కొనితెచ్చుకోరని చెప్పారు. వ్యక్తిగత నంబర్లు మినహా మిగిలిన మెసేజ్‌లను తొలగించేస్తూనే ఉంటామన్నారు.
ఇంతకీ పిటిషనర్ కవితపై మీరు (సీబీఐ, ఈడీ) మోపిన నేరాభియోగాలతో ఇంకెన్నాళ్లు జైల్లోనే కొనసాగేలా చేస్తారని, నేరంలో పాల్గొన్నట్టుగా ఏదైనా ఇతర ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీలను సూటిగా ప్రశ్నించింది. ఒక మహిళగా బెయిల్ ప్రయోజనాలు పొందేందుకు కవిత ఎందుకు అర్హురాలు కాదో చెప్పాలని నిలదీసింది. ఫోన్లు ఫార్మాట్ చేశారనో, మెసేజ్‌లు డిలీట్ చేశారనో చెప్పడం కాదని, ఆధారాలకు సంబంధించిన మెటీరియల్ చూపాలని ఆదేశించింది. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెప్పడానికి, ఫోన్ ఫార్మాట్ లేదా మెసేజ్‌లు డిలీట్ చేయడం వంటివి కాకుండా ఇంకేమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పాలని ప్రశ్నించింది.
ఇతర నిందితులతో ఆమెకు ఉన్న సంబంధాన్ని చూపించడానికి తమ వద్ద కాల్ డాటా రికార్డులు ఉన్నాయని ఈ సందర్భంగా ఎస్వీ రాజు చెప్పారు. కవిత ఆడిటర్ బుచ్చిరాజు ద్వారా సౌత్ లాబీ నుంచి నగదు ముట్టిందని తెలిపారు. దీంతో కల్పించుకున్న సుప్రీంకోర్టు.. అయితే, బుచ్చిరాజుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీసింది. దీంతో రాజు వాదిస్తూ.. సీఎం కేజ్రీవాల్‌ను కలిసినట్టు మరో నిందితుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నారని, మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఎంపీ పనుల్లో బిజీగా ఉండడంతో రూ.25 కోట్లు తన కొడుకు మాగుంట రాఘవతో పంపినట్టు మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారని ఎస్వీ రాజు చెప్పారు.
దీనిపై రోహత్గీ కల్పించుకుని వాళ్లు అప్రూవర్‌గా మారారని, సాక్షులందరినీ అప్రూవర్లుగా చేశారని చెప్పారు. దీనిపై జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకొని… నిందితుడు అప్రూవర్‌గా మారారా? అన్న ప్రశ్నకు అవునని రాజు జవాబు చెప్పారు. రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునే ముందు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పారు.
కవిత న్యాయవాది రోహత్గీ కల్పించుకుని కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత… ఇలా అందర్నీ కింగ్పిన్గానే పేర్కొంటున్నారని తప్పుపట్టారు. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారిన వారంలోనే వాళ్లకు బెయిల్ వచ్చేసిందన్న విషయాన్ని రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ, సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. అప్రూవర్లు ఇచ్చిన ప్రకటనలు మినహా దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్న ఆధారాలు శూన్యమని పేర్కొన్నారు.
ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు. నెలలపాటు విచారణ జరిగిందంటున్నారు. గుట్టలకొద్దీ సాక్ష్యాలు సేకరించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. మరి, ఇంత పెద్ద స్కామ్ జరిగితే, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకపోవడమేంటి? అసలు స్కామ్ జరిగినట్టు రుజువులేమిటి?
నిందితుల్లో కొందరిని అప్రూవర్లుగా పరిగణనలోకి తీసుకున్నాక ఈడీ, సీబీఐ ప్రాసిక్యూషన్ విధానాన్ని కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈడీ కేసులో బుచ్చిబాబు, గౌతమ్ ముత్తా, మాగుంట రాఘవ పాత్రలపై జస్టిస్ గవాయి ఆరా తీశారు. బుచ్చిబాబు, గౌతమ్ ముత్తా ఈడీ కేసులో నిందితులుగా లేరని, సీబీఐ కేసులో అప్రూవర్లుగా మారారని ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. మాగుంట రాఘవ డబ్బును బుచ్చిబాబు ద్వారా కవితకు ఇచ్చారని చెప్తున్నప్పుడు బుచ్చిబాబు ఎందుకు నిందితుడు కాలేదని జస్టిస్ గవాయ్ మళ్లీ నిలదీశారు. మాగుంట రాఘవ పాత్ర మనీలాండరింగ్ వ్యవహారంలో లేదని రాజు చెప్పడంపై జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతవరకు చేసిన వాదనలతో మీరే విభేదిస్తుంటే, మీ వాదనలతో మీరే ఏకీభవించకపోతే ఎలాగని ప్రశ్నించారు.
తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పినట్టు రాఘవ, కవితకు బదులు బుచ్చిబాబుకు రూ.25 కోట్లు ఇచ్చారని చెప్పారని, ఇప్పుడు ఆ మాట మార్చడం సరికాదని ధర్మాసనం ఈడీ, సీబీఐని హెచ్చరించింది. ప్రాసిక్యూషన్ న్యాయంగా ఉండాలని, నిందితుడిని సాక్షిగా మార్చి దాని ఆధారంగా ప్రాసిక్యూషన్ విధానాన్ని కొనసాగించడం సముచితం కాదని అభిప్రాయపడింది. రేపు ఎవరినైనా మీ ఇష్టం వచ్చినట్టు అదుపులోకి తీసుకుంటారా? అని నిలదీసింది.
ఏ ఆరోపణ అయినా న్యాయమైన, సహేతుకంగా విచక్షణతో కూడినట్టు ఉండాలని హితవు పలికింది. ఒక బెయిల్ కోసం గంటన్నరపాటు వాదనలు సరికాదన్నది. మహిళలకు సంబంధించి సీఆర్పీసీ, పీఎంఎల్ఏ, ఇతర సెక్షన్ల కింద పలు మినహాయింపులు ఉన్నాయని న్యాయస్థానం గుర్తుచేసింది. భోజన విరామం తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని ఎస్వీ రాజు కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించి విచారణను కొనసాగించింది.
తిరిగి ఎస్వీ రాజు కల్పించుకుని సహ నిందితుల్లో ఒకరైన రామచంద్ర పిళ్లై కవితకు నోటీసులు ఇచ్చాక తన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయి కల్పించుకుని.. రామచంద్ర పిళ్లై స్టేట్మెంట్ కాకుండా… ఇతరత్రా న్యాయపరమైన ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కవిత నేరం చేసినట్టుగా ఉన్న ఆధారాలు ఏమిటో చూపాలని ప్రశ్నించారు.
దీంతో మళ్లీ కల్పించుకొన్న రాజు.. పిైళ్లె తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేలా కవిత ప్రభావితం చేసినట్టు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న సంధించింది. అరుణ్ పిైళ్లె తాను ఉపసంహరణ ప్రకటన చేసినప్పుడు అతను మీ (ఈడీ) కస్టడీలోనే ఉన్నారని, అలాంటప్పుడు దానికి కవితను ఎలా బాధ్యులు చేస్తారని నిలదీసింది.
కవిత ఈడీ కస్టడీలో ఉండగానే సహ నిందితులను ఏవిధంగానూ ప్రభావితం చేయలేరని తేల్చి చెప్పింది. మాగుంట రాఘవ కూడా మద్యం విధాన వ్యవహారంలో కవిత పాత్ర ఉన్నట్టు చెప్పారని ఎస్వీ రాజు చెప్పగానే కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కల్పించుకుని, మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారిన తర్వాతి మాటలను ఈడీ, సీబీఐ ఆధారంగా చేసుకోవడం దారుణమన్నారు. కేసులో సహ నిందితులు ఎవరూ పిటిషనర్ కవిత పాత్ర గురించి చెప్పలేదన్నారు. మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారిపోయి బెయిల్‌పై ఏనాడో బయటకు వచ్చేశాడని, సీబీఐ, ఈడీల మనిషిగా మాగుంట రాఘవ ఉన్నాడని చెప్పారు.
గోవా ఎన్నికల పేరుతో రూ.వంద కోట్లను సౌత్ లాబీ నుంచి ఢిల్లీకి వచ్చేలా చేశారనే కీలక అభియోగాలకు ఈడీ, సీబీఐ ఇప్పటికీ సరైన ఆధారాలు చూపలేదని రోహత్గీ తప్పుపట్టారు. ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, కేవలం అభియోగాలతో పిటిషనర్‌ను ఐదు నెలలుగా జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.
సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసి 5 నెలలు అయ్యిందని, ఈడీ ప్రాసిక్యూషన్ పూర్తి చేసి నాలుగు నెలలు అయ్యిందని, 493 మంది సాక్షులను ఈడీ/సీబీఐ విచారించడమే కాకుండా 50 వేల పత్రాలను పరిశీలన చేశాయని వివరించారు. ఈ కేసుల్లో 57 మంది నిందితుల విచారణ జరిగిందని, అయినా బెయిల్ మంజూరు చేయొద్దని సీబీఐ, ఈడీ వాదించడం విచిత్రంగా ఉన్నదని పేర్కొన్నారు.
ఎంపీగా చేసిన కవిత ఇప్పడు ఎమ్మెల్సీగా బాధ్యాతాయుత పదవిలో ఉన్నారని, న్యాయప్రక్రియ నుంచి తప్పించుకునే ఆస్కారమే లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రోహత్గీ లేవనెత్తిన అన్ని విషయాలపై ఈడీ, సీబీఐని ప్రశ్నించింది. అయితే, అటు నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కల్పించుకొన్న ధర్మాసనం.. కవిత ఉన్నత స్థాయిలో ఉన్న మహిళని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తిరిగి రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ, సాక్షులను పిటిషనర్ కవిత బెదిరించారనే అభియోగాలకు అర్థం లేదని, దీన్ని సాకుగా చూపిస్తూ బెయిల్ మంజూరు చేయవద్దనడం అర్థం లేనిదని అన్నారు.
దర్యాప్తు అధికారులు అడిగిన వెంటనే పిటిషనర్ తన ఫోన్లు ఇచ్చారని, అవి ఫార్మాట్ చేశారని చెప్పి అదే నేరానికి మూలమంటే ఎలాగని ప్రశ్నించారు. ఫోన్లు మార్చడమనేది సర్వసాధారణ విషయమని, మెసేజ్‌లు తొలగింపు కూడా అందరూ చేసేదేనని, వాడిన ఫోన్లను తన దగ్గర పనిచేసే వాళ్లకు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఫోన్‌ను ఫార్మాట్ చేస్తారనే కనీస అవగాహన కూడా లేకుండా దర్యాప్తు అభియోగాలు చేస్తున్నారని తప్పుపట్టారు.
వాస్తవానికి పిటిషనర్ కవిత 2022 నవంబర్ 22న తన ఫోన్‌ను నాశనం చేశారని దర్యా ప్తు అధికారులే చెప్పారని రోహత్గీ గుర్తు చేశారు. అయితే, అధికారులు కవితకు 2023 మార్చి 7న సమన్లు ఇచ్చారు. తొలిసారి సమన్లు జారీ చేయడానికి నాలుగు నెలలు ముందుగానే ఫోన్ ఫార్మాట్ లేదా మరొకటి జరిగితే దాన్ని స్యాక్ష్యాలను ధ్వంసం చేశారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇదే కేసులో ఆప్ నాయకుడు మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు ఉత్తర్వులను పరిశీలిస్తే కీలక విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
బెయిల్ పొందడం హక్కని, జైల్లో కొనసాగడం అసాధారణమని సుప్రీంకోర్టు చెప్పిందని, విచారణ జాప్యం కావడాన్ని కూడా తప్పుపట్టిందని గుర్తు చేశారు. దీనికి ధర్మాసనం అవునంటూ సమాధానమిచ్చింది. ఆధారాలు లేకుండా కేవలం సీబీఐ, ఈడీలు చెప్పినట్టు పలికే అప్రూవర్ సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను జైలులో ఉంచడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని రోహత్గీ కోరారు.
గత ఐదు నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని, దర్యాప్తు పూర్తి కూడా అయ్యిందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిందని, ఇందుకు అనుగుణంగా ఈడీ తమ దర్యాప్తు ముగించిందని కోర్టుకు తెలిపారు.
మరో నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈడీ, సీబీఐ కేసులు రెండింటిలోనూ బెయిల్ పొంది విడుదలయ్యారని, మరో నిందితుడు కేజ్రీవాల్ ఈడీ కేసులో బెయిల్ పొందారని గుర్తుచేశారు. ఈ కేసులోని నిందితుల్లో ఏకైక మహిళ కవిత మాత్రమేనని, సెక్షన్-45(1) కింద మహిళా నిందితులకు ప్రత్యేకమైన వెసులుబాటు ఉన్నదని, వీటిని పరిగణనలోకి తీసుకుని కేసులో ఏకైక మహిళ అయిన కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కేసు విచారణ పూర్తయిందని, ట్రయిల్ జరుగుతున్నందున నిందితులను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.