ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 గంటలపాటు ఎవరిని ఎలా ఇబ్బందిపెట్టాలి..? ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి..? వంటి ఆలోచనతోనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేశంలో గవర్నర్ల వ్యవస్థను రాజకీయాలకు ఎలా వాడుకోవాలని చూస్తుంటారు.
-కేజ్రీవాల్
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం పైనే ప్రధాని మోదీ దృష్టి పెడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. 2024లో బీజేపీకి ఎట్టి పరిస్థితిలో అధికారం కట్టబెట్టరాదంటూ ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మోదీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. దేశాన్ని బాగు చేస్తాడని ప్రజలు అధికారం అప్పగిస్తే దేశాన్ని బర్బాద్ చేశాడని మండిపడ్డారు. సభకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి కేజ్రీవాల్ కేంద్రాన్ని ఘాటుగా విమర్శిస్తూనే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 గంటలపాటు ఎవరిని ఎలా ఇబ్బందిపెట్టాలి? ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి? వంటి ఆలోచనతోనే ఉంటారని విమర్శించారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థను రాజకీయాలకు ఎలా వాడుకోవాలని చూస్తున్నది మోదీయేనని విమర్శించారు. ఎవరిపై ఐటీ, ఈడీ, సీబీఐలను వాడాలంటూ కూడా ఆలోచిస్తుంటాడని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులే లక్ష్యంగా ప్రధానమంత్రి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో మనం ఇంకా అభివృద్ధి చెందలేదని, మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్, బాంబుదాడిలో సర్వం కోల్పోయిన జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలు ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచించలేదని కేజ్రీవాల్ విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కంటివెలుగు రెండో దశను ప్రారంభించేందుకు వచ్చామని కేజ్రీవాల్ చెప్పారు. నాలుగు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయడం, కంటి అద్దాలు ఇవ్వడం, అవసరమైనవారికి ఆపరేషన్లు చేయడం అద్భుతమని, దేశంలో ఈ తరహా కార్యక్రమం ఎక్కడా లేదని ప్రశంసించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము కూడా ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, కంటివెలుగు గురించి తెలంగాణ నుంచి నేర్చుకుంటున్నామని ప్రకటించారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నానని, కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులంతా ఒకే దగ్గర అందుబాటులో ఉండాలన్నది మంచి ఆలోచనని, ప్రజల పనులు సులువుగా అవుతాయని తెలిపారు. అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం ఉండదని, సమీకృత కలెక్టరేట్ల ఆలోచన మాకు కూడా నచ్చిందని, ఢిల్లీలో కూడా ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలంటూ ఒకరితో ఒకరు కొట్లాడడం వల్ల ఉపయోగంలేదని పేర్కొన్నారు. రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటే మన దేశం బాగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోహల్లా క్లీనిక్‌లను ఏర్పాటు చేశామని, వీటిలో పేదలందరికీ ఉచిత వైద్యం అందుతున్నదని చెప్పారు. తెలంగాణలో కూడా అదే తరహాలో ఆస్పత్రులను బస్తీ దవాఖాన పేరుతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఢిల్లీలోని పాఠశాలలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని. ఇక్కడ 99 శాతం మందికిపైగా విద్యార్ధులు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారని వెల్లడించారు. పాఠశాలల్లో అనేక వసతులపై అధ్యయనం చేయడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చారని, తమ తరహా స్కూళ్లను తమిళనాడులో కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ స్కూళ్ల ప్రారంభోత్సవానికి తనను కూడా ఆహ్వానించారని, ఇదో ఆరోగ్యకరమైన పద్ధతని పేర్కొన్నారు.