న్యూఢిల్లీ: నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్(లాల్ ఖిలా) సమీపంలోని మెట్రో స్టేషన్‌కు చెందిన గేట్ నంబర్.1 వెలుపల సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రెడ్ఫోర్ట్తోపాటు దాని సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉండడం, పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సోమవారం సెలవుదినం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎర్ర కోటకు కేవలం 1.1 కిలోమీటర్ల దూరంలో 16వ శతాబ్దం నాటి జామా మసీదు ఉండగా కొన్ని వందల మీటర్ల దూరంలో సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలం గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ ఉంది.
1930వ దశకంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడాన్ని వీక్షించి ప్రార్థనలు చేసుకునేందుకు వేలాది మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. పాత ఢిల్లీలో ప్రసిద్ధి గాంచిన చాందినీ చౌక్ మార్కెట్ కూడా లాల్ ఖిలాకు కేవలం 1.4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. షాజహాన్ నిర్మించిన ఈ మార్కెట్లో సమస్త వస్తువులు హోల్‌సేల్ ధరలకే దొరుకుతాయన్న కారణంతో ఇది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. చాందినీ చౌక్‌లోనే పురాతన జైన మందిరం శ్రీ దిగంబర్ జైన్ లాల్ మందిర్ కూడా ఉంది. 1658లో రెడ్ నిర్మించిన ఈ లాల్ మందిర్ పర్యాటక ప్రదేశంగా కూడా ప్రసిద్ధి పొందింది. అదే విధంగా మహాత్మా గాంధీ స్మారకం ఉన్న రాజ్‌ఘాట్ కూడా ఎర్ర కోటకు కేవలం 1.8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.