కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన జంప్ జిలానీలకు వెన్నులో వణుకు మొదలైంది. ఎన్నుకున్న ప్రజల తీర్పును మోసగించి.. గోడ దూకిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారమే పరమావధిగా కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలకు.. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని ఆందోళన మొదలైంది. భవిష్యత్తుపై భయం పట్టుకున్నది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఉపఎన్నికలు ఖాయమని, తాము ఓడిపోవడం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించినట్టున్నారు. తమ భవిష్యత్తుపై చీకట్లు అలుము కున్నాయని వారికి అర్థమైంది. అనర్హత వేటును తప్పించుకొనేందుకు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరి కండువాలు కప్పుకొన్నవాళ్లు.. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని నిస్సిగ్గుగా దబాయిస్తున్నారు.
పాపభీతి లేదు. ఎన్నుకున్న జనం ఏమనుకుంటారన్న సోయిలేదు.ఇన్నాళ్లు ప్రజాసమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన ఏ ఆందోళనలోనూ పాల్గొనని వీళ్లంతా.. శాసనసభాపక్ష భేటీకి, ఆఖరికి పార్టీ రజతోత్సవ సభకూ హాజరుకాని వీళ్లంతా.. బీఆర్ఎస్లోనే ఉన్నారట. అనర్హత తమకు వర్తించదట! ఇదీ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ మార్కు అపహాస్యం!
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిన నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని డ్రామాలకు తెరలేపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ గడిచిన ఏడాదిన్నరగా స్పీకర్‌ను బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్గౌడ్లకు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నోటీసులకు వారు సమాధానాలు పంపించారు. తాము పార్టీ ఫిరాయించలేదని, తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని సమాధానం ఇచ్చారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు సమాధానాల్లో పేర్కొన్నారు.
జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, వాటికి ఆ ఎమ్మెల్యేలు సమాధానాలు పంపించారని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం వ్యక్తిగతంగా లేఖలు పంపించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో వివరణను పెన్‌డ్రైవ్‌లో పంపాలని లేఖలో పేర్కొన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ వెనకేసుకొస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో చెప్పాలని లేఖ పంపడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నెలల తరబడి సమయం ఇచ్చి, బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలకు మాత్రం మూడు రోజుల్లో రిజాయిండర్ ఇవ్వాలని అడగడం సరికాదని అంటున్నారు. ఇదే నిబంధన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెట్టి ఉంటే కేసు ఏడాదిన్నర క్రితమే ముగిసి ఉండేదని చెప్తున్నారు.
గురువారం మొత్తం 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాధానాలను స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా పంపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన సమాధానాలు మాత్రం రాలేదని తెలిసింది. వీరు సమాధానాలు ఇవ్వలేదా? ఇచ్చినా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించలేదా? అన్న విషయంలో స్పష్టత లేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పేలే లేదు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైనా వేటు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలుత ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, దీంట్లో తొలివరుసలో ఉండేది దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై నిక్కచ్చిగా ఉన్నదని, బీఆర్ఎస్ ఆధారాలు పక్కగా సమర్పించిన నేపథ్యంలో వేటు తప్పదన్న అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ బీ ఫారంపై సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీచేసిన దానం నాగేందర్‌పై వేటు వేయక తప్పదని స్పీకర్‌కు, సీఎం రేవంత్‌కు న్యాయ నిపుణులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. మిగిలిన వారిని మాత్రం తాత్కాలికంగా తప్పించే వీలుందని చెప్పినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తదుపరి విచారణ ప్రారంభించే లోపు దానంపై చర్య తీసుకుంటే మిగిలిన ఎమ్మెల్యేలను మరికొంతకాలం కొనసాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని ముఖ్యమంత్రికి నివేదించినట్టు తెలిసింది. అనర్హత వేటు వేస్తే ఇబ్బందని, అలా కాకుండా రాజీనామా చేయాలని సీఎం, స్పీకర్ సూచించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో దానం నాగేందర్ త్వరలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తారని సమాచారం. అలాగే, కడియం శ్రీహరి కూడా వేటు తప్పదన్న భావనతో ఉన్నారు. వేటు పడకముందే రాజీనామా చేస్తే పరువు దక్కుతుందన్న అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెల్సింది. అయితే, వీరిద్దరు రాజీనామా చేస్తే మిగిలిన 8 మందిపై ఒత్తిడి పెరుగుతుందన్న భావన కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి స్పీకర్ సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఇస్తారని సమాచారం.