హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట వాస్తవమే అని, అది పార్టీ ఫిరాయింపు కిందకు రాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాదించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపించారు.
అప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. సీఎంను కలిసినపుడు కప్పి ఉంటారని, కండువా కప్పుకున్నాం కానీ పార్టీ ఫిరాయించలేదని వారు వాదించినట్టు సమాచారం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను, కాంగ్రెస్ పెద్దలను కలిశామంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వారు చేరిన తేదీ, ఆ తర్వాత వారు చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు కావడం వంటివాటన్నింటిపై న్యాయవాదులు ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకొన్న ఎమ్మెల్యేలు చివరకు అది ఫిరాయింపు కిందకు రాదని సమాధానమిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను స్పీకర్ వద్ద నమోదు చేయించారు.
వచ్చే వారమే వాదనలు
స్పీకర్ వద్ద ఇప్పటివరకు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం వారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది. ఇప్పుడు విచారణ ప్రక్రియలోని చివరి ఘట్టం మొదలుకానుంది. వచ్చేవారం ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లోనే స్పీకర్ ప్రకటించనున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమేనని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతోపాటు నిర్ణీత గడవులో స్పీకర్ నిర్ణయం తీసుకోనందున సుప్రీంకోర్టే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో పిటిషన్ కూడా సుప్రీంకోర్టులోనే దాఖలైంది. ఈ రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్పీకరించనున్నది.
ఆ ఇద్దరి సమాధానం కోసం ఇంకెన్నాళ్లు..?
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు ముందుకు కదలడం లేదు. వీరిద్దరికి స్పీకర్ నోటీసు ఇచ్చినా.. వారి వద్ద నుంచి సమాధానాలు రాలేదని చెప్తున్నారు. వారి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత మాత్రమే తాము తదుపరి విచారణ చేపడ్తామని స్పీకర్ కార్యాలయ అధికారులు చెప్తున్నారు.