శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 12:05:01

కిడ్నాప్ చేసిన గంట‌లోపే బాలుడి హ‌త్య‌

కిడ్నాప్ చేసిన గంట‌లోపే బాలుడి హ‌త్య‌

మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని హ‌త్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం వ‌ద్ద‌ దానమయ్య గుట్టపై బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీక్షిత్‌ను హ‌త్య చేశార‌ని తెలియ‌డంతో.. త‌ల్లిదండ్రులు, బంధువులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు బాలుడి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి కిడ్నాప్ కేసులో ప్ర‌ధాన నిందితుడు మంద సాగ‌ర్‌(23)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9) ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. శ‌నిఘాపురం వాసి అయిన మంద సాగ‌ర్‌ సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చి.. బాలుడిని ఎక్కించుకుని వెళ్లాడు. ఆ త‌ర్వాత‌.. అన్నారం వ‌ద్ద దాన‌మ‌య్య గుట్ట వ‌ద్ద‌కు తీసుకెళ్లిన సాగ‌ర్‌.. గంట‌లోపే బాలుడి గొంతు పిసికి హ‌త్య చేశాడు. రాత్రి 8 గంట‌ల్లోపే సాగ‌ర్ ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. 


రాత్రి 9:15 గంట‌ల‌కు తల్లిదండ్రుల‌కు ఫోన్

తల్లి వసంతకు సాగ‌ర్‌ ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని, ఈ విషయాన్ని మీరు ఎక్కడా చెప్పవద్దు, పోలీసులకు కంప్లైంట్ చేయవద్దు అని చెప్పాడు. మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మా వ్యక్తులు ఉన్నారంటూ బెదిరించారు.  మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని, మీ బాబుకు జ్వరం గా ఉంది మాత్రలు కూడా వేశాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. దీంతో దీక్షిత్ త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడే కేసు న‌మోదు చేసి బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తెలిసిపోతుంద‌నే భ‌యంతోనే హ‌త్య‌

మంద‌సాగ‌ర్.. దీక్షిత్ కుటుంబానికి తెలుసు. డ‌బ్బు డిమాండ్ చేసి దీక్షిత్‌ను వ‌దిలిపెడితే తన‌కు ఏం జ‌రుగుతుందో అని ఆందోళ‌న చెందే బాలుడిని హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత ఇంట‌ర్నెట్ కాల్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేశాడు. బాలుడిని చంపిన త‌ర్వాత కూడా రెండు రోజుల పాటు ఫోన్ చేసి త‌ల్లిదండ్రుల‌ను బెదిరించాడు. అయితే బాలుడి హ‌త్య విష‌యం బ‌య‌ట‌కు రావొద్ద‌నే ఉద్దేశంతో.. మ‌ళ్లీ దాన‌మ‌య్య గుట్ట వ‌ద్ద‌కు వెళ్లి శవంపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టాడు. అయితే ఈజీగా డ‌బ్బులు సంపాదించి.. విలాస‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌నే ఉద్దేశంతోనే దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. 

సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిందితుడు అరెస్టు

సాంకేతిక ప‌రిజ్ఞానంతోనే నిందితుడు మంద సాగ‌ర్‌ను అరెస్టు చేశామ‌ని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇంట‌ర్నెట్ కాల్స్ ద్వారానే నిందితుడిని గుర్తించ‌గ‌లిగామ‌న్నారు. గురువారం ఉద‌యం 3 గంట‌ల‌కు సాగ‌ర్ ను అరెస్టు చేశామ‌న్నారు. ఈ కేసును చేధించేందుకు హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కీల‌క పాత్ర పోషించారు.