హనుమకొండ, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారేందుకు ఉద్యమంలో కీలక ఘట్టం.. ఉద్యమ నేత కేసీఆర్ నిరాహారదీక్ష. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో గులాబీ దళపతి చేపట్టిన నిరాహార దీక్షతోనే రాష్ట్రం వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మొదలైన క్షణం నుంచి పోలీసుల నిర్బంధాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, అనివార్య పరిస్థితులలో అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మొదటిసారి ప్రకటన తదితర ఉద్యమ రోజుల స్మరణకోసం బీఆర్ఎస్ దీక్షాదివస్ (నవంబర్ 29) నుంచి విజయ్‌దివస్ (డిసెంబర్ 9) వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో 11 రోజులపాటు దీక్షాదివస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవంబర్ 26న వరంగల్‌కు వచ్చి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. నవంబర్ 29న మొదలైన దీక్షాదివస్ నుంచి విజయ్‌దివస్ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు మమేకమయ్యారు. తెలంగాణ ఉద్యమ గొప్పదనాన్ని ఇప్పటి తరాలకు తెలియజెప్పేలా విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.