BC Reservations | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తిస్థాయి కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు ప్రక్రియను రెండు వారాల్లో పూర్తిచేయాలని నొక్కిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా, రాష్ట్ర బీసీ కమిషన్‌కు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన బాధ్యతలను బీసీ కమిషన్ నుంచి తప్పించాలని, అందుకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయాలని, ఆ మేరకు రాష్ట్ర సరార్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. బీసీ రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను, పలు రాష్ర్టాల హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సోదాహరణంగా వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించే బాధ్యతలను బీసీ కమిషన్‌కే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని, అదే ‘డెడికేటెడ్ కమిషన్’గా వ్యవహరిస్తుందని పేర్కొనడంపై బీఎస్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన బాధ్యతల నుంచి బీసీ కమిషన్‌ను తప్పించాలని కోరారు. అందుకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసేవిధంగా తెలంగాణ సరార్కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకించారు. రాష్ట్ర చట్టాల ద్వారా కల్పించే అధిక, అసమాన రిజర్వేషన్లు న్యాయస్థానాల ఎదుట నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అదే సమయంలో బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలైన ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ (6)లను కొట్టివేయడాన్ని కూడా సమర్థించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
రిజర్వేషన్ల ప్రయోజనం కోసం వెనుకబడిన తరగతులను గుర్తించడం అనేది కార్యనిర్వాహక విధి అని ధర్మాసనం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. వెనుకబాటుతనం స్వభావం, సవాళ్లపై క్షేత్రస్థాయి అధ్యయనం, విచారణను నిర్వహించేందుకు ఆర్టికల్ 340 ప్రకారం ప్రత్యేక కమిషన్లను నియమించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని హైకోర్టుకు వివరించారు. ఓబీసీలకు స్థానికసంస్థల్లో సీట్లను రిజర్వు చేయడానికి ఇదివరకు జారీచేసిన ట్రిపుల్ టెస్ట్ షరతులను రాష్ట్రం పాటించాలని, అందుకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మరో కేసులో నొక్కి చెప్పిందని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభు త్వం జయంత్‌కుమార్ భాటియా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తే అవి చెల్లుబాటు కాకుండా పోతాయని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే లేకుండా పోతాయని వివరించారు. న్యాయపరమైన ఆటంకాల్లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలను వినిపించారు. బీసీ కమిషన్‌కే డెడికేటెడ్ కమిషన్‌గా అధికారాలు కల్పించామని వివరించారు. దీంతో మరోసారి బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఏజీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 340 అధికరణ ద్వారా డెడికేటెడ్ కమిషన్‌ను మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతమున్న బీసీ కమిషన్‌కే డెడికేటెడ్ కమిషన్ అధికారాలు కట్టబెట్టడం సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధమని తేల్చిచెప్పారు. ఇరువురి వాదనల అనంతరం జస్టిస్ ఎస్ నంద పిటిషనర్ ఆర్ కృష్ణయ్య లేవనెత్తిన వ్యాజ్యంలోని అంశాలను సమర్థించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని ప్రభుత్వానికి స్పష్టంచేశారు. సుప్రీం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కూడా ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండు వారాల్లో స్థాయి నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.