హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘పరిస్థితులు చూస్తుంటే ఆదాయం పెరిగే మార్గాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే ఈ ఆదాయం సరిపోవడంలేదు. ఇంకా ఆరు గ్యారెంటీల్లో అనేక పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటికి నిధులెట్లా? ఇప్పటివరకు ఏవో సాకులు చెప్తూ తప్పించుకున్నాం. ప్రజలు కూడా కొత్త ప్రభుత్వమని సమయం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు అవుతున్నది. ఇకపై ప్రజలు కూడా ఓపిక పట్టరు. హామీల అమలుపై ప్రశ్నిస్తారు. వాటిని అమలు చేయకుండా ఇంకెన్ని రోజులు తప్పించుకుంటాం..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై రుసరుసలాడినట్టు తెలిసింది. ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం ఆదాయ సమీకరణపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు, ఇప్పుడొస్తున్న ఆదాయానికి ఏ మాత్రం పొంతనలేకుండా పోయింది. దీంతో నాడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సర్కారుకు తలకుమించిన భారంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తున్నది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అధికారులకు పక్కా ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం ప్రతి నెలా ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది. అయితే చాలా నెలల్లో ఆదాయం రూ.17వేల కోట్లకు మించడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని ప్రతి నెలా రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెంచాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలా అయితేనే గట్టెక్కగలుగుతామని, లేనిపక్షంలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని సీఎం ఆందోళన వ్యక్తంచేసినట్టు పేర్కొన్నాయి. ఇప్పటికే భూముల మార్కెట్ విలువలను పెంచిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచే ఆలోచన చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. భూముల అమ్మకంపైనా దృష్టి పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, అందులో అధిక ధరకు విక్రయించే ప్రాంతాలను ప్రత్యేకంగా ఉంచాలని ఆదేశించినట్టు సమాచారం. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్తోపాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలని సూచించినట్టు పేర్కొన్నాయి.
ఆదాయం పెంపు కోసం ‘చేజింగ్ సెల్’
ఆదాయం పెంపు చర్యల్లోభాగంగా ప్రభుత్వం చేజింగ్ సెల్ ఏర్పాటు చేయబోతున్నది. ఈ మేరకు సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అధిక ఆదాయం సమకూర్చేందుకు శాఖలవారీగా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని, లేనిపక్షంలో చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించినట్టు తెలిసింది.